RJNEWS TELUGU
Newspaper Banner

అలియాబాద్‌లో అభివృద్ధి పనులకు ఆమోదం కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు

మేడ్చల్ ఆర్జేన్యూస్ : అలియాబాద్ పురపాలక సంఘ సాధారణ కౌన్సిల్ సమావేశం సోమవారం చైర్‌పర్సన్ కంటం శిరీష కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగింది. పురపాలక సంఘ పరిధిలో చేపట్టనున్న అభివృద్ధి పనులు, పారిశుద్ధ్య నిర్వహణ, మౌలిక వసతుల కల్పన, పర్యావరణ పరిరక్షణ అంశాలపై చర్చించి పలు కీలక తీర్మానాలను ఆమోదించారు.

ప్రభుత్వం నిర్వహించనున్న వనమహోత్సవాన్ని విజయవంతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు. గ్రీన్‌ బడ్జెట్‌లో 10 శాతం నిధులు కేటాయించి పట్టణంలో పచ్చదనం పెంపొందించే కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని తీర్మానించారు.స్వచ్ఛ భారత్‌ మిషన్‌ (ఎస్‌బీఎం)–2.0 కింద 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రణాళికలను ఆమోదించారు. సుమారు రూ.1.28 కోట్ల వ్యయంతో, మున్సిపాలిటీ 17 శాతం వాటా నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేశారు.పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాల నిర్వహణ, అంతర్గత రహదారుల మరమ్మతులు, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి, పార్కులు, హరిత ప్రాంతాల అభివృద్ధి, సిబ్బంది సంక్షేమంపై కూడా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ శిరీష కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి పట్టణాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సకాలంలో, నాణ్యతతో అమలు చేస్తామని తెలిపారు. కౌన్సిలర్లు తమ వార్డుల సమస్యలను సమావేశం దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సమావేశం నిర్ణయించింది. కార్యక్రమంలో వైస్‌ చైర్‌పర్సన్ మాలతి మాధవరెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.