🔸300 మందికి ఉచిత ప్రోటీన్ కిట్ల పంపిణీ – ఆవుల రాజిరెడ్డి
ఆర్.జె.న్యూస్, కొల్చారం : గర్భిణీ స్త్రీల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో “మాతృదేవోభవ” కార్యక్రమం ద్వారా 300 మందికి ఉచిత ప్రోటీన్ కిట్లను పంపిణీ చేశారు. కొల్చారం మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన గర్భిణీలకు అందుబాటులో ఉండేలా మండల కేంద్రంలోని బాబా గార్డెన్స్, రంగపేటలోని శ్రీ రంగనాయక ఫంక్షన్ హాల్‌లో ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ గర్భిణీలకు పోషకాహారం అందించడం ద్వారా తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే ఈ కార్యక్రమ ఉద్దేశమని అన్నారు. “ప్రతి తల్లి ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి బిడ్డ ఆరోగ్యంగా జన్మించాలి. ఇది మనందరి బాధ్యత. అందుకే ‘మాతృదేవోభవ’ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తాం” అని పేర్కొన్నారు. అనంతరం గర్భిణీ స్త్రీలతో కలిసి భోజనం చేశారు. వారితో ఆప్యాయంగా మాట్లాడి ఆరోగ్య పరిస్థితులు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. పంపిణీ చేసిన ప్రోటీన్ కిట్లలో గర్భిణులకు అవసరమైన పౌష్టిక ఆహార పదార్థాలు ఉన్నాయి. దీంతో లబ్ధిదారుల కుటుంబాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.