RJNEWS TELUGU
Date of Publish : 12 September 2026, 2:18 pm Posted by : RJ NEWS TELUGU

కోర్టు ఆదేశాల ధిక్కరణ.. పంచాయతీ కార్యదర్శిపై సస్పెన్షన్ వేటు

ఆర్.జె.న్యూస్, వెబ్ డెస్క్ : మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రియాంకను జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఆమె కాళ్లకల్ గ్రామంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో నత్తి చంద్రకళకు చెందిన ఇంటి నిర్మాణ వ్యవహారంలో కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించినట్లు విచారణలో వెల్లడైంది. దీంతో ఆమెపై సస్పెన్షన్ చర్యలు తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కోర్టు ఆదేశాలను ధిక్కరించడం తీవ్రమైన అంశంగా పరిగణించిన జిల్లా యంత్రాంగం ఈ చర్యకు ఉపక్రమించింది.

సస్పెన్షన్‌పై గోప్యత.. అనుమానాలకు తావు

కలెక్టర్ కార్యాలయం నుంచి సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ అయినప్పటికీ, మండల స్థాయి అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం చర్చనీయాంశంగా మారింది. ఉత్తర్వులు అందినా బహిరంగంగా వెల్లడించకపోవడంపై స్థానికంగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సస్పెన్షన్‌కు దారితీసిన పూర్తి కారణాలు, మండల అధికారుల తీరుపై జిల్లా అధికారులు స్పష్టత ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.