RJNEWS TELUGU
Date of Publish : 16 July 2026, 8:13 pm Posted by : RJ NEWS TELUGU

గచ్చిబౌలిలో భారీ రేషన్ బియ్యం అక్రమ రవాణా భగ్నం – 22 టన్నుల బియ్యం స్వాధీనం

లారీ, 4 టాటా ఏస్‌లు సీజ్ – ఐదుగురు అరెస్ట్ – బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న ముఠా చిక్కింది

ఆర్ జె న్యూస్, హైదరాబాద్, గచ్చిబౌలి  :
పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు అక్రమంగా తరలిస్తున్న ముఠాను సివిల్ సప్లై అధికారులు, గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. గౌలిదొడ్డి గురుకుల పాఠశాల సమీపంలో శనివారం నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో అధికారులు ఒక లారీ, నాలుగు టాటా ఏస్ వాహనాలను అడ్డుకున్నారు. వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న 22 టన్నుల రేషన్ బియ్యం, 2 టన్నుల గోధుమలను స్వాధీనం చేసుకున్నారు.

♦️రెడ్‌హ్యాండెడ్‌గా ఐదుగురి అరెస్ట్
ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. అదే సమయంలో ఉపయోగించిన లారీతో పాటు 4 టాటా ఏస్ వాహనాలను కూడా సీజ్ చేశారు.

♦️బ్లాక్ మార్కెట్ కోసమే అక్రమ రవాణా
ప్రాథమిక విచారణలో పేదలకు ఉచితంగా అందాల్సిన రేషన్ ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి, బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయించేందుకు ఈ ముఠా అక్రమ రవాణా చేస్తున్నట్లు వెల్లడైంది. విశ్వసనీయ సమాచారం మేరకు సివిల్ సప్లై అధికారులు, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి ఈ భారీ అక్రమ రవాణాను భగ్నం చేశారు. ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు, నెట్‌వర్క్‌పై లోతుగా విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.