RJNEWS TELUGU
Date of Publish : 12 September 2026, 8:32 pm Posted by : RJ NEWS TELUGU

గణేష్‌ ఉత్సవాలకు భారీ బందోబస్తు

🔸5,749 మంది పోలీసులతో భద్రత..

 🔸1,200 మందితో ట్రాఫిక్‌ నియంత్రణ 5 వేల సీసీ కెమెరాలు..

🔸ఏఐ డ్రోన్లతో నిఘా : సీపీ సుమతి

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : గణేష్‌ ఉత్సవాలు, నిమజ్జనాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు మల్కాజిగిరి పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు సీపీ సుమతి తెలిపారు. ‘గణేష్‌ సురక్ష సంకల్ప్‌–2026’లో భాగంగా ‘మన గణేష్‌–మన భద్రత’ నినాదంతో ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు.

ఈ ఏడాది కమిషనరేట్‌ పరిధిలో 15 వేలకుపైగా గణేష్‌ విగ్రహాలు ఏర్పాటు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. మండపాల ఏర్పాటుకు ఇప్పటివరకు 6,500 ఆన్‌లైన్‌ దరఖాస్తులు అందినట్లు వెల్లడించారు. బందోబస్తు కోసం 5,749 మందికిపైగా పోలీసు సిబ్బందిని వినియోగించనున్నట్లు, ఇతర జిల్లాలు, ప్రత్యేక విభాగాల నుంచి అదనపు బలగాలను రప్పించినట్లు చెప్పారు. ట్రాఫిక్‌ నియంత్రణకు 1,200 మంది సిబ్బంది విధుల్లో ఉంటారని పేర్కొన్నారు. నిమజ్జనాల కోసం 27 చెరువులు, బేబీ పాండ్లు, తాత్కాలిక ట్యాంకులను గుర్తించినట్లు సీపీ తెలిపారు. హైదరాబాద్‌ సిటీ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ 24 గంటల కంట్రోల్‌ రూమ్‌ ద్వారా నిమజ్జన ఊరేగింపులను పర్యవేక్షిస్తామన్నారు. సుమారు 5 వేల సీసీ కెమెరాలు, ఏఐ ఆధారిత డ్రోన్లతో సున్నిత ప్రాంతాలు, ఊరేగింపులు, ట్రాఫిక్‌ రద్దీపై నిఘా ఉంచనున్నట్లు చెప్పారు.‘మీ సురక్ష–సహచరి’ కార్యక్రమంలో 2,200 మంది వాలంటీర్లు 552 గణేష్‌ మండపాల వద్ద పోలీసులతో కలిసి భద్రతపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, అగ్నిమాపక, విద్యుత్‌, ట్రాఫిక్‌, శబ్ద కాలుష్య నిబంధనలు పాటించాలని నిర్వాహకులకు సూచించారు. డీజేలకు అనుమతి లేదని సీపీ సుమతి స్పష్టం చేశారు.