RJNEWS TELUGU
Date of Publish : 24 August 2026, 1:37 pm Posted by : RJ NEWS TELUGU

తొలి ప్రపంచ ఓపెన్‌ తైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో అక్కాతమ్ముడి సత్తా

🔸నాలుగు పతకాలు కైవసం.. తెలంగాణకు, కొంపల్లి ఢిల్లీ వరల్డ్‌ పబ్లిక్‌ స్కూల్‌కు గర్వకారణం

ఆర్.జె.న్యూస్,కొంపల్లి : తెలంగాణలో తొలిసారిగా నిర్వహించిన ప్రపంచ ఓపెన్‌ తైక్వాండో ఛాంపియన్‌షిప్‌–2026లో అక్కాతమ్ముడు అద్భుత ప్రతిభ కనబరిచారు. గచ్చిబౌలి స్టేడియంలో ఆగస్టు 21 నుంచి 23 వరకు జరిగిన అంతర్జాతీయ పోటీల్లో భారత్‌ తరఫున పాల్గొన్న మాలోత్‌ సాన్వి రియా, మాలోత్‌ ఆరుష్‌ మిథుల్‌ కలిపి నాలుగు పతకాలు సాధించారు. ఈ పోటీల్లో దేశంలోని 22 రాష్ట్రాలతో పాటు 12 దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. 9వ తరగతి చదువుతున్న సాన్వి రియా 14 ఏళ్లలోపు క్యోరుగి విభాగంలో స్వర్ణ పతకం, పూమ్సే విభాగంలో కాంస్య పతకం సాధించింది. సాన్వి రియా తమ్ముడు, 3వ తరగతి విద్యార్థి ఆరుష్‌ మిథుల్‌ 8 ఏళ్లలోపు క్యోరుగి విభాగంలో స్వర్ణ పతకం, వేగవంతమైన పంచింగ్‌ విభాగంలో రజత పతకం గెలుచుకున్నాడు. ఈ ప్రతిష్ఠాత్మక పోటీలను తెలంగాణ సాంకేతిక మరియు నిర్వహణ విభాగం మేనేజర్‌, డైరెక్టర్‌ రాజు రాథోడ్‌ ఆధ్వర్యంలో అమికల్‌ క్రీడా అకాడమీ, అమికల్‌ క్రీడా సమాఖ్య, జేఆర్‌ అంతర్జాతీయ తైక్వాండో అకాడమీ సంయుక్తంగా నిర్వహించాయి. చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయి పోటీల్లో నాలుగు పతకాలు సాధించిన సాన్వి రియా, ఆరుష్‌ మిథుల్‌ను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కోచ్‌లు, కుటుంబ సభ్యులు అభినందించారు. వీరి విజయం తెలంగాణతో పాటు కొంపల్లిలోని ఢిల్లీ వరల్డ్‌ పబ్లిక్‌ స్కూల్‌కు గర్వకారణమని పేర్కొన్నారు.