RJNEWS TELUGU
Date of Publish : 08 September 2026, 10:31 pm Posted by : RJ NEWS TELUGU

భ్రూణ లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు!

🔸పీసీపీఎన్‌డీటీ నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదు: డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కె. ఆనంద్‌

ఆర్.జె.న్యూస్, మేడ్చల్‌ : భ్రూణ లింగ నిర్ధారణకు పాల్పడే ఆసుపత్రులు, స్కానింగ్‌ కేంద్రాలపై అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. పీసీపీఎన్‌డీటీ చట్ట నిబంధనలను ఉల్లంఘిస్తూ ఆడ శిశువులపై వివక్షకు, భ్రూణహత్యలకు దారితీసే చర్యలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ కె. ఆనంద్‌ స్పష్టం చేశారు.రాష్ట్ర స్థాయి పీసీపీఎన్‌డీటీ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో నిబంధనల ఉల్లంఘనలు గుర్తించిన నేపథ్యంలో జోడిమెట్ల ఎక్స్‌ రోడ్‌, పోచారం ప్రాంతంలోని అన్ష్ ఆసుపత్రిని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కె. ఆనంద్‌ తనిఖీ చేశారు.ఆసుపత్రిలో పీసీపీఎన్‌డీటీ చట్టానికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌, చట్టబద్ధమైన రికార్డులు, నెలవారీ నివేదికలు, తప్పనిసరి రిజిస్టర్లు, నిర్దేశిత ప్రమాణాలు, ప్రోటోకాల్స్‌ను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. కేంద్రం రిజిస్ట్రేషన్‌ చెల్లుబాటుతో పాటు రికార్డుల నిర్వహణ, చట్ట నిబంధనల అమలు తీరును పరిశీలించారు.

 

ఆడ శిశువులపై వివక్షను సహించం’

ఈ సందర్భంగా డాక్టర్‌ కె. ఆనంద్‌ మాట్లాడుతూ.. గర్భస్థ శిశువు లింగాన్ని నిర్ధారించడం, వెల్లడించడం చట్టరీత్యా తీవ్రమైన నేరమని హెచ్చరించారు. ఇలాంటి చర్యలు ఆడ శిశువులపై వివక్షకు, భ్రూణహత్యలకు దారితీస్తాయని పేర్కొన్నారు. వైద్య సేవలను అడ్డుపెట్టుకుని ప్రజలను, ముఖ్యంగా మహిళలను దోపిడీ చేసే విధానాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. జిల్లాలోని ప్రతి రిజిస్టర్డ్‌ కేంద్రం పీసీపీఎన్‌డీటీ చట్టంలోని అన్ని నిబంధనలు, నిర్దేశిత ప్రమాణాలు, ప్రోటోకాల్స్‌ను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.లింగ వివక్షను అరికట్టి ఆడ శిశువులకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా జిల్లాలో పీసీపీఎన్‌డీటీ చట్ట అమలుపై నిరంతర తనిఖీలు, పర్యవేక్షణ కొనసాగుతాయని డీఎంహెచ్‌ఓ తెలిపారు.ఈ తనిఖీల్లో సీఐఏ,పీసీపీఎన్‌డీ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ గీతా ప్రసాద్‌, డిప్యూటీ డెమో వసంతరెడ్డి పాల్గొన్నారు.