RJNEWS TELUGU
Date of Publish : 12 September 2026, 5:51 pm Posted by : RJ NEWS TELUGU

మద్యం మత్తులో బ్రీజా కారు బీభత్సం

🔸 ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు.. ఇద్దరికి గాయాలు

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : మద్యం మత్తులో కారు నడుపుతూ ఓ వ్యక్తి బీభత్సం సృష్టించిన ఘటన మేడ్చల్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కిష్టాపూర్‌ నుంచి మేడ్చల్‌ వైపు వెళ్తున్న టీజీ 08 ఎన్‌ 8752 నంబరు గల బ్రీజా కారును ధీరజ్‌సింగ్‌ నడుపుతున్నట్లు సమాచారం. మజీద్‌పూర్‌ వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. అంతకుముందు మరో షిఫ్ట్‌ డిజైర్‌ కారును కూడా ఢీకొట్టినట్లు తెలిసింది.ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న రాకేష్‌ (30) కాలుకు తీవ్ర గాయమైంది. నవీన్‌కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్‌ మద్యం మత్తులో వాహనం నడిపినట్లు స్థానికులు ఆరోపించారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేసి ప్రమాదానికి కారణమైన వ్యక్తిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.