RJNEWS TELUGU
Date of Publish : 03 August 2026, 2:39 pm Posted by : RJ NEWS TELUGU

మిషన్ భగీరథ నీటికి మోటార్లు..!

🔸 రాఘవేంద్ర నగర్‌లో తాగునీటి కోసం ప్రజల అవస్థలు

🔸 కొంతమంది అక్రమంగా మోటార్లు బిగించి నీరు లాగుతున్నారని ఆరోపణలు..

🔸 పట్టించుకోని జీహెచ్‌ఎంసీ అధికారులు

ఆర్ జె న్యూస్, మేడ్చల్: మేడ్చల్ జీహెచ్‌ఎంసీ పరిధిలోని రాఘవేంద్ర నగర్ కాలనీలో మిషన్ భగీరథ తాగునీటి సరఫరాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొంతమంది పైప్‌లైన్‌కు అక్రమంగా మోటార్లు బిగించి అధికంగా నీటిని లాగుతున్నారని, దీంతో మిగిలిన కాలనీవాసులకు తగినంత నీరు అందడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.మోటార్ల ద్వారా కొందరు నీటిని లాగేయడంతో పైప్‌లైన్‌లో నీటి ఒత్తిడి తగ్గి, కాలనీలోని అనేక ఇళ్లకు చుక్క నీరు కూడా చేరడం లేదని వాపోతున్నారు. ప్రతి రోజు తాగునీటి కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోందని, ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లపై ఆధారపడే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయాన్ని పలుమార్లు జీహెచ్‌ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి తనిఖీలు నిర్వహించలేదని, అక్రమంగా మోటార్లు వినియోగిస్తున్న వారిపై చర్యలు తీసుకోలేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ప్రజల మౌలిక అవసరమైన తాగునీటి విషయంలో కూడా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.అక్రమంగా మోటార్లు బిగించి నీటిని లాగుతున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, మిషన్ భగీరథ నీరు ప్రతి ఇంటికీ సమానంగా అందేలా జీహెచ్‌ఎంసీ అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.