RJNEWS TELUGU
Date of Publish : 20 August 2026, 8:50 am Posted by : RJ NEWS TELUGU

సుఖవ్యాధులపై అవగాహన పెంచాలి

ఆర్.జె.న్యూస్,అలియాబాద్ : అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో సుఖవ్యాధులు (STIs), వాటి నివారణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు CRG Care ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సుఖవ్యాధులపై ప్రజలు అపోహలకు లోనుకావద్దని సూచించారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే అర్హత కలిగిన వైద్యులను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకుని, వైద్యుల సూచనల మేరకు చికిత్స పొందాలని తెలిపారు. CRG Care ప్రతినిధులు సుఖవ్యాధులు వ్యాప్తి చెందే మార్గాలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యక్తిగత పరిశుభ్రత, సురక్షిత ఆరోగ్య అలవాట్లు, సకాలంలో వైద్య సలహా పొందడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. సుఖవ్యాధులపై ఉన్న అపోహలను తొలగించి, వ్యాధుల నివారణకు అవసరమైన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించడమే కార్యక్రమం ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, CRG Care ప్రతినిధులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.