RJNEWS TELUGU
Date of Publish : 29 September 2026, 9:36 am Posted by : RJ NEWS TELUGU

ప్రజావాణికి 111 అర్జీలు

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మను చౌదరి, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి. విజయేందర్‌రెడ్డితో పాటు డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా రెవెన్యూ అధికారి పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు భూ సమస్యలు, పింఛన్లు, ఇళ్ల స్థలాలు తదితర అంశాలపై మొత్తం 111 అర్జీలను అధికారులకు అందజేశారు. అర్జీదారులతో కలెక్టర్ స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలను వేగంగా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

విద్యార్థుల చిత్రకళకు కలెక్టర్‌ ప్రశంస

ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా మల్కాజ్‌గిరిలోని టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ కళాశాలకు చెందిన విద్యార్థులు జిల్లా కలెక్టరేట్‌ను సందర్శించారు. విద్యార్థులు స్వయంగా రూపొందించిన పలు చిత్రాలను ప్రదర్శించారు. జిల్లా కలెక్టర్ మను చౌదరి చిత్రపటంతో పాటు ‘రైజింగ్ తెలంగాణ’ ఇతివృత్తంతో రూపొందించిన చిత్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు.విద్యార్థుల సృజనాత్మకతను కలెక్టర్ మను చౌదరి, అదనపు కలెక్టర్ డి. విజయేందర్‌రెడ్డి అభినందించారు. యువతలోని కళాత్మక ప్రతిభను ప్రోత్సహించాలని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.