RJNEWS TELUGU
Date of Publish : 11 September 2026, 5:56 pm Posted by : RJ NEWS TELUGU

కూకట్‌పల్లి కేపీహెచ్‌బీలో భారీ చిట్ ఫండ్ మోసం

🔸50 నుండి 70 కోట్లతో దంపతులు పరార్ – బాధితుల ఆందోళన

ఆర్.జె.న్యూస్, కూకట్‌పల్లి : కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ పరిధిలో భారీ చిట్ ఫండ్ మోసం వెలుగులోకి వచ్చింది. చిట్టీల పేరుతో అమాయకుల నుండి కోట్లాది రూపాయలు వసూలు చేసి దంపతులు పరారయ్యారు. కూకట్‌పల్లి ఇందిరానగర్‌కు చెందిన బక్కా మారుతి రెడ్డి (55) అనే వ్యాపారి కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అడ్డగుట్టలో నివాసం ఉంటున్న రమణారెడ్డి, సీత దంపతులు గత కొన్నేళ్లుగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తూ ప్రజలకు నమ్మకం కల్పించారని, ఇప్పుడు ఏకంగా ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారని బాధితులు ఆరోపిస్తున్నారు. దీంతో అడ్డగుట్టలోని వారి నివాసం వద్ద బాధితులంతా ధర్నాకు దిగారు. తమ డబ్బులు తీసుకుని ఐపీ పెట్టి కోర్టు నుంచి 48 మందికి నోటీసులు వచ్చాయని, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నామని బాధితులు వాపోయారు. కూతురు పెళ్లి కోసం, పిల్లల చదువుల కోసం, సొంత ఇంటి నిర్మాణం కోసం చిట్టీలు వేసి దాచుకున్న డబ్బులతో తమను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దంపతుల బాధితులు చాలా మంది ఉన్నారని, దాదాపు 50 నుంచి 70 కోట్ల మేర వసూలు చేశారని ఆరోపించారు. తమ డబ్బులతో విలాసవంతమైన జీవితం గడుపుతూ, కూతురు పెళ్లికి కేజీల కొద్దీ బంగారం, వెండి కట్నంగా ఇచ్చి, స్థలాలు కొనుగోలు చేశారని, ఇప్పుడు మా దగ్గర ఏమీ లేదంటూ ఐపీ పెట్టి పారిపోయారని బాధితులు ఆరోపిస్తున్నారు. కేపీహెచ్‌బీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.