RJNEWS TELUGU
Date of Publish : 04 October 2026, 11:27 pm Posted by : RJ NEWS TELUGU

మేడ్చల్‌ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం

రెండు ఫర్నిచర్‌ దుకాణాలు దగ్ధం.. రూ.20 లక్షల వరకు నష్టం

ఆర్ జె న్యూస్, మేడ్చల్‌ : మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పారిశ్రామికవాడలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారి-44 పక్కన తాత్కాలిక షెడ్లలో నిర్వహిస్తున్న రెండు ఫర్నిచర్‌ దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో రూ.20 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు.స్థానికులు, అగ్నిమాపక శాఖ అధికారుల వివరాల ప్రకారం.. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2 గంటల సమయంలో ఫర్నిచర్‌ దుకాణాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దుకాణాల్లోని సోఫాలు, పరుపుల్లోని ఫోమ్‌, రెగ్జిన్‌, కొబ్బరి నార తదితర మండే పదార్థాలతో మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో కొద్దిసేపటికే రెండు దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.సమాచారం అందుకున్న వెంటనే శామీర్‌పేట అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఫైర్‌ ఆఫీసర్‌ శివప్రసాద్‌ ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టారు. సకాలంలో మంటలను అదుపు చేయడంతో పక్కనే ఉన్న మరో దుకాణానికి ప్రమాదం తప్పింది. మేడ్చల్‌ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

అగ్ని భద్రతా చర్యలు తప్పనిసరి

తాత్కాలిక షెడ్లలో ఫర్నిచర్‌ దుకాణాలు ఏర్పాటు చేసేటప్పుడు అగ్ని భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఫైర్‌ ఆఫీసర్‌ శివప్రసాద్‌ సూచించారు. ఫోమ్‌, గడ్డి, రెగ్జిన్‌ వంటి త్వరగా మండే పదార్థాలను నిల్వ చేసే దుకాణాల్లో ఫైర్‌ ఎక్స్‌టింగ్విషర్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. దుకాణాల మధ్య తగినంత దూరం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.