RJNEWS TELUGU
Date of Publish : 12 August 2026, 2:36 pm Posted by : RJ NEWS TELUGU

దేవరయాంజాల్‌లో లాజిస్టిక్స్‌ గోదాంలో భారీ అగ్నిప్రమాదం

ఆర్.జె.న్యూస్,మేడ్చల్ జిల్లా: షామీర్‌పేట్‌ మండలంలోని దేవరయాంజాల్‌ గ్రామ పరిధిలోని కోల్డ్‌రష్‌ లాజిస్టిక్స్‌ గోదాంలో బుధవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం నుంచి గోదాంలో మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పది ఫైర్‌ ఇంజిన్లతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలు ఇంకా పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీగా పొగలు కమ్ముకోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది.ప్రమాదం నేపథ్యంలో డీఆర్‌ఎఫ్‌, ఫైర్‌ సిబ్బందితో పాటు ఎయిర్‌ఫోర్స్‌, పోలీసులు, మున్సిపల్‌ సిబ్బంది పెద్ద సంఖ్యలో మోహరించారు. మంటలను అదుపు చేసే క్రమంలో ఎయిర్‌ఫోర్స్‌ ఫైర్‌ సిబ్బందిలో కొందరు తీవ్రంగా అలసిపోయి సొమ్మసిల్లినట్లు సమాచారం.గోదాంలో భారీగా సామగ్రి ఉండటంతో భారీగా ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే ఎంత మేర నష్టం వాటిల్లిందనే విషయం పూర్తిస్థాయి అగ్నిమాపక చర్యలు పూర్తయిన తర్వాతే వెల్లడయ్యే అవకాశం ఉంది.అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.