RJNEWS TELUGU
Date of Publish : 13 November 2026, 7:27 pm Posted by : RJ NEWS TELUGU

ట్రక్కును ఢీకొని యువకుడు మృతి..!

మరొకరికి గాయాలు..

గుర్తుతెలియని ట్రక్కు డ్రైవర్‌పై కేసు నమోదు

ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : జీనోమ్‌ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో మజీద్‌పూర్‌ ఎక్స్‌ రోడ్డు వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు గాయపడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రాంపూర్‌ గ్రామానికి చెందిన నవీన్‌ (20) హైదరాబాద్‌లోని సిటీ కాలేజీలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సెలవుల నిమిత్తం స్వగ్రామానికి వచ్చిన అతడు గురువారం రాత్రి తాళ్లపేట నుంచి లక్షెట్టిపేటకు వెళ్లి తన స్నేహితుడు సిద్ధును కలిశాడు. అనంతరం ఇద్దరూ సిద్ధుకు చెందిన ద్విచక్రవాహనంపై హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున 2.10 గంటల సమయంలో మజీద్‌పూర్‌లోని మారుతి షోరూం ఎదుటకు చేరుకోగానే, ముందు వెళ్తున్న గుర్తుతెలియని ట్రక్కు డ్రైవర్‌ అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో వెనుక నుంచి వస్తున్న బైక్‌ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌ నడుపుతున్న నవీన్‌ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా, వెనుక కూర్చున్న సిద్ధుకు గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి రమేష్‌ ఫిర్యాదు మేరకు జీనోమ్‌ వ్యాలీ పోలీసులు గుర్తుతెలియని ట్రక్కు డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు.