RJNEWS TELUGU
Date of Publish : 17 September 2026, 9:23 am Posted by : RJ NEWS TELUGU

కీసరలో ఏసీబీ ట్రాప్‌..! రూ.5 లక్షలు తీసుకుంటుండగా ఎస్సై పట్టివేత.. ఇన్‌స్పెక్టర్‌పైనా ఆరోపణలు

అర్ జె న్యూస్ కీసర : మేడ్చల్‌ – మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్‌స్టేషన్‌లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బుధవారం అర్ధరాత్రి సోదాలు నిర్వహించారు. లంచం తీసుకుంటుండగా ఎస్సై జ్ఞానేందర్‌రెడ్డిని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం. కీసర చెరువు సమీపంలో కారులో రూ.5 లక్షలు స్వీకరిస్తుండగా ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.స్టేషన్‌ బెయిల్‌ ఇప్పించేందుకు రూ.10 లక్షలు డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో రూ.5 లక్షలు ఎస్సైకి ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఈ మేరకు బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, పక్కా ప్రణాళికతో అధికారులు వలపన్ని పట్టుకున్నట్లు తెలిసింది.ఈ వ్యవహారంలో కీసర ఇన్‌స్పెక్టర్‌ ఆర్కపల్లి ఆంజనేయులు పాత్రపైనా ఆరోపణలు రావడంతో ఆయనను కూడా ఏసీబీ అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం. కెమికల్‌ పరీక్షల విషయంలోనూ బాధితుడిని ఇబ్బందులకు గురిచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని రోజులుగా బిర్యానీలు, కూల్‌డ్రింక్స్‌ తీసుకురావాలని వేధించినట్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. గణేష్‌ నిమజ్జన విధుల్లో ఉన్న సమయంలోనే ఎస్సై లంచం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏసీబీ అధికారులు పట్టుకునేందుకు ప్రయత్నించగా ఎస్సై పరుగులు తీసినట్లు సమాచారం. అనంతరం కీసర పోలీస్‌స్టేషన్‌తో పాటు సంబంధిత అధికారుల ఇళ్లలోనూ ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏసీబీ డీఎస్పీ మజీద్‌ అలీఖాన్‌ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరుగుతున్నట్లు సమాచారం. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు వెల్లడించాల్సి ఉంది.