RJNEWS TELUGU
Date of Publish : 11 August 2026, 6:51 pm Posted by : RJ NEWS TELUGU

ఉప్పరపల్లి భూ సమస్య పరిష్కారానికి చర్యలు

ఆర్.జె.న్యూస్, మేడ్చల్‌: శామీర్‌పేట మండలం ఉప్పరపల్లి గ్రామంలోని ప్లాట్ల సమస్యను నిబంధనల ప్రకారం పరిశీలించి, అర్హులైన పేదలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, ముఖ్యమంత్రి ప్రజావాణి కార్యక్రమం ఇన్‌చార్జి డాక్టర్‌ జి.చిన్నారెడ్డి ఆదేశించారు.ఉప్పరపల్లి గ్రామానికి చెందిన మాజీ జెడ్పీటీసీ పి.బాలేష్‌ బేగంపేటలోని ప్రజావాణి కార్యక్రమంలో డాక్టర్‌ చిన్నారెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. గ్రామంలోని ప్లాట్లకు సంబంధించి కొంతకాలంగా నెలకొన్న సమస్యను ఆయన వివరించారు. ఈ సమస్య కారణంగా భూములపై ఆధారపడిన అర్హులైన పేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.వినతిపత్రాన్ని పరిశీలించిన డాక్టర్‌ చిన్నారెడ్డి మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌కు సమస్యను పరిశీలించి, నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.సంబంధిత రెవెన్యూ రికార్డులు, భూముల వాస్తవ పరిస్థితి, గతంలో జరిగిన విచారణలు, తెలంగాణ హైకోర్టు తీర్పును పరిశీలించి న్యాయపరంగా తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి అర్హులైన పేదలకు న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్య పరిష్కారానికి డాక్టర్‌ చిన్నారెడ్డి ఆదేశాలు ఇవ్వడంపై ఉప్పరపల్లి గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. త్వరితగతిన సమస్య పరిష్కారం అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.