RJNEWS TELUGU
Date of Publish : 12 September 2026, 8:58 pm Posted by : RJ NEWS TELUGU

క్రీడల్లో ప్రతిభతో పాటు ఫిట్‌నెస్‌ కీలకం

🔸త్రిబుల్‌ ఒలింపియన్‌ ఎన్‌. ముకేశ్‌ కుమార్‌

ఆర్ జె న్యూస్ వెబ్ డెస్క్ : క్రీడల్లో ప్రతిభతో పాటు శారీరక దారుఢ్యం, ఫిట్‌నెస్‌ ఎంతో కీలకమని త్రిబుల్‌ ఒలింపియన్‌, మాజీ భారత హాకీ క్రీడాకారుడు ఎన్‌. ముకేశ్‌ కుమార్‌ అన్నారు. ఫిట్‌నెస్‌ లేకపోతే ఆటలో రాణించడం కష్టమవడంతో పాటు గాయాల ముప్పు కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. క్రీడాకారులకు పీఈటీలు క్రమం తప్పకుండా ఫిట్‌నెస్‌ శిక్షణ అందించాలని సూచించారు. బాచుపల్లిలోని సూర్య గ్లోబల్‌ స్కూల్‌లో 70వ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుత్బుల్లాపూర్‌ జోనల్‌ స్థాయి టోర్నమెంట్‌ కమ్‌ సెలక్షన్స్‌లో రెండో రోజు కోకో పోటీలు ఉత్సాహంగా జరిగాయి. అండర్‌-14, అండర్‌-17 బాలబాలికల విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో సుమారు 1,100 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ముకేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. తాను అనేక పాఠశాలలను సందర్శించానని, ఏ క్రీడను ఎంచుకున్నా ముందుగా ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలని క్రీడాకారులకు సూచించారు. సరైన శారీరక దారుఢ్యం లేకుండా క్రీడల్లో రాణించడం కష్టమని, ఇంజరీలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అనంతరం క్రీడాకారులతో ముకేశ్‌ కుమార్‌ ముచ్చటించి వారి ఆట, శిక్షణ, భవిష్యత్‌ లక్ష్యాలను తెలుసుకున్నారు. త్రిబుల్‌ ఒలింపియన్‌తో మాట్లాడే అవకాశం లభించడంతో క్రీడాకారుల్లో ఉత్సాహం నెలకొంది.కార్యక్రమంలో కుత్బుల్లాపూర్‌ జోనల్‌ సెక్రెటరీ పి. నాగరాజు గౌడ్‌, పీడీలు వినోద్‌, విజయ్‌, రమేష్‌, సురేష్‌, సునీల్‌ తదితరులు పాల్గొన్నారు.