RJNEWS TELUGU
Date of Publish : 01 November 2026, 8:25 pm Posted by : RJ NEWS TELUGU

గొర్రెల కాపరుల ఆత్మరక్షణకు ఆయుధాల లైసెన్సులు ఇవ్వాలి

🔸గొర్రెలు, మేకల పెంపకందారుల సమస్యలపై జీఎంపీఎస్ సమగ్ర సర్వే

ఆర్ జె న్యూస్ , మేడ్చల్ : గొర్రెలు, మేకల పెంపకందారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి ఆత్మరక్షణ కోసం ఆయుధాల లైసెన్సులు మంజూరు చేయాలని గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం (జీఎంపీఎస్) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆదివారం ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని డెబిల్పూర్, మేడ్చల్ జీహెచ్ఎంసీ పరిధిలోని అత్తివెల్లి గ్రామాల్లో సంఘం ఆధ్వర్యంలో గొర్రెలు, మేకల పెంపకందారుల స్థితిగతులపై సమగ్ర సర్వే నిర్వహించారు.ఈ సందర్భంగా జీఎంపీఎస్ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎక్కలదేవి కొమురయ్య, జిల్లా సహాయ కార్యదర్శి భావన వెంకటేష్ మాట్లాడుతూ.. గొర్రెల పెంపకందారుల ఆర్థిక, సామాజిక స్థితిగతులు, వారికి ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాలు, సబ్సిడీల వివరాలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు సర్వే చేపట్టినట్లు తెలిపారు.గొర్రెల పెంపకందారులు ఎలినోవో ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం తక్షణమే వారిని ఆదుకోవాలని కోరారు. చదువుకున్న గొల్ల, కురుమ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని, ఖాళీగా ఉన్న వెటర్నరీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గొర్రెల దొంగతనాలు, వీధి కుక్కల దాడులతో కాపరులు తీవ్రంగా నష్టపోతున్నారని, వారి ప్రాణాలకు రక్షణ కల్పించేందుకు ఆత్మరక్షణ ఆయుధాల లైసెన్సులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.అలాగే బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు అందించాలని, పశుగ్రాసం కొరత నివారించాలని, గొర్రెలు, మేకలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని, బీమా పథకాన్ని పటిష్ఠంగా అమలు చేయాలని కోరారు. ఇటీవల కాలంలో గొర్రెల దొంగతనాలు, కుక్కల దాడులు పెరిగిపోవడంతో పెంపకందారులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.సర్వే ద్వారా సేకరించిన వివరాల ఆధారంగా గొర్రెల పెంపకందారుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై, సంబంధిత అధికారులపై ఒత్తిడి తీసుకొస్తామని వారు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జీఎంపీఎస్ గ్రామ సొసైటీ అధ్యక్షులు సీహెచ్ కృష్ణ, సొసైటీ అధ్యక్షులు బొందుల నవీన్, నాయకులు పెద్ద మల్లేష్, చిన్న మల్లేష్, సీహెచ్ ఈశ్వర్, రామచంద్రయ్య, కుమార్ బాబు, ఈట వెంకటేష్, పింజర్ల శ్రీశైలం, గంగని రాజు తదితరులు పాల్గొన్నారు.