RJNEWS TELUGU
Date of Publish : 29 September 2026, 8:04 pm Posted by : RJ NEWS TELUGU

కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లు పక్కాగా ఉండాలి

🔸🔸

🔸ఫార్మర్‌ రిజిస్ట్రీ లక్ష్యం 70 శాతానికి చేరాలి: కలెక్టర్‌ మను చౌదరి

ఆర్ జె న్యూస్, మేడ్చల్‌ : జిల్లాలో ఫార్మర్‌ రిజిస్ట్రీ ప్రక్రియను వేగవంతం చేసి త్వరలోనే 70 శాతం లక్ష్యాన్ని అధిగమించాలని మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ మను చౌదరి క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ విజయేందర్‌రెడ్డితో కలిసి ధాన్యం కొనుగోలు సన్నాహాలు, రైతుల సంక్షేమంపై సమీక్ష నిర్వహించారు.
రానున్న ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసేందుకు పౌరసరఫరాలు, వ్యవసాయశాఖ అధికారులు, ఏఓలు, ఏఈఓలు, కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జులతో సమావేశం నిర్వహించారు. ప్రతి మండలంలో కనీసం ఒక ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ సూచించారు. కొనుగోలు కేంద్రాలకు అవసరమైన స్థలాలను ముందుగానే గుర్తించాలని, రవాణా ఆలస్యాలను నివారించేందుకు ప్రత్యామ్నాయ గోదాములు, అదనపు నిల్వ స్థలాలను గుర్తించాలని ఆదేశించారు.

పరికరాలు సిద్ధంగా ఉంచాలి

అన్ని కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు, సుత్తిలి, తేమ కొలిచే యంత్రాలు, ఆటోమేటిక్‌ క్లీనింగ్‌ మిషన్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రాల నుంచి గోదాములకు ధాన్యం తరలించేందుకు తగినన్ని వాహనాలను సిద్ధం చేయాలని రవాణా కాంట్రాక్టర్లను ఆదేశించారు. గోదాముల వద్ద అన్‌లోడింగ్‌కు ట్రాఫిక్‌ అంతరాయం, కూలీల కొరత లేకుండా ముందస్తు సమన్వయం చేసుకోవాలని సూచించారు.

వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి

ధాన్యం ఆరబెట్టుకునేందుకు కొనుగోలు కేంద్రాల సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఖాళీ స్థలాలను తహసీల్దార్లతో సమన్వయం చేసుకుని గుర్తించాలని కలెక్టర్‌ తెలిపారు. అకాల వర్షాల నుంచి ధాన్యాన్ని రక్షించేందుకు వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు రైతులకు చేరవేయాలని సూచించారు. కొనుగోళ్ల సమయంలో సమస్యలు తలెత్తితే రైతులతో అధికారులు, కేంద్రాల ఇన్‌చార్జులు ఓపికగా, సానుకూలంగా వ్యవహరించి శాంతియుతంగా పరిష్కరించాలని ఆదేశించారు.
అధికారులు, సిబ్బంది, కాంట్రాక్టర్లు వెల్లడించిన సమస్యలను పరిష్కరిస్తామని, అవసరమైన మేరకు వ్యవసాయ యంత్రాలను అందుబాటులోకి తెస్తామని కలెక్టర్‌ తెలిపారు.సమావేశంలో జిల్లా సివిల్‌ సప్లై డీఎం సుగుణబాయి, సివిల్‌ సప్లై అధికారి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి చంద్రకళ, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.