ఆర్ జె న్యూస్, శామీర్ పేట : మహిళలు, బాలికలపై హింసను అరికట్టడంతో పాటు వారికి చట్టపరమైన రక్షణ, న్యాయం అందించడంపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని అలియాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ శిరీష కృష్ణారెడ్డి అన్నారు. మహిళలపై హింస నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం అలియాబాద్ మున్సిపల్ కార్యాలయంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని సఖి వన్‌స్టాప్ సెంటర్ ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నవంబరు 25 నుంచి డిసెంబరు 10 వరకు చేపట్టనున్న 16 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు, బాలికలపై హింసను అంతం చేసేందుకు సమష్టిగా కృషి చేయాలని, బాధితులకు న్యాయం అందించి, నేరస్థులకు శిక్ష పడేలా చూడాలనే 2026 నినాదంపై అవగాహన కల్పించారు. మహిళలపై హింస ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనగా కొనసాగుతోందని, పురుషులు, మహిళలను అన్ని రంగాల్లో సమానంగా చూడాలని, లింగ వివక్షను రూపుమాపేందుకు సామాజిక మార్పు అవసరమని వక్తలు పేర్కొన్నారు. మహిళలకు చట్టపరమైన రక్షణ, న్యాయం పొందే హక్కులపై అవగాహన కల్పించారు. సఖి కేంద్రాల ద్వారా బాధిత మహిళలకు వైద్య సహాయం, కౌన్సెలింగ్, పోలీసు, న్యాయ సహాయం, తాత్కాలిక వసతి వంటి సమీకృత సేవలను 24 గంటల పాటు అందిస్తున్నట్లు వివరించారు. మహిళా సహాయం కోసం 181, బాలల సహాయం కోసం 1098 హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో 20వ వార్డు కౌన్సిలర్ మౌనిక, వైద్యాధికారులు డాక్టర్ సంగీత, డాక్టర్ ఎలీనా, సఖి కేంద్రం ఇన్‌ఛార్జి తిరుమలదేవి, నిర్వాహకులు సలోమి, రేణుక, సూపర్‌వైజర్లు నాగమణి, మమత, కేస్ వర్కర్ శిరీష, పలువురు మహిళలు పాల్గొన్నారు.