RJNEWS TELUGU
Date of Publish : 26 October 2026, 8:57 pm Posted by : RJ NEWS TELUGU

విద్యార్థులకు పోక్సో చట్టంపై అవగాహన – కిష్టాపూర్ గురుకులంలో లీగల్ సర్వీసెస్ కమిటీ చైతన్యం

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : విద్యార్థులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, ఆత్మవిశ్వాసంతో సమస్యలను ఎదుర్కోవాలని మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ప్రతినిధులు సూచించారు. మేడ్చల్ జీహెచ్ఎంసీ పరిధి కిష్టాపూర్ గ్రామంలోని గురుకుల పాఠశాలలో సోమవారం పోక్సో చట్టం, సోషల్ మీడియా వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ చైర్ పర్సన్ జి.భానుమతి, సభ్యురాలు ఎం.ప్రసన్న మాట్లాడుతూ, బాలల హక్కులు, లైంగిక వేధింపుల నుంచి రక్షణ పొందే మార్గాలను విద్యార్థులకు వివరించారు. ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినా భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు తెలియజేయాలని, ఉచిత న్యాయ సహాయ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. బాలల సహాయం కోసం 1098, పోలీసుల సహాయం కోసం 100 నంబర్లకు కాల్ చేయవచ్చని తెలిపారు. సోషల్ మీడియా వినియోగంలో వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యమివ్వాలని, అపరిచితులతో వ్యక్తిగత వివరాలు, ఫోటోలు పంచుకోవద్దని, అనుమానాస్పద లింకులు తెరవవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.