RJNEWS TELUGU
Date of Publish : 01 September 2026, 7:32 am Posted by : RJ NEWS TELUGU

నిషేధిత రంగులతో బేకరీ ఉత్పత్తులు..! కేసు నమోదు కొల్తూరులో శ్రీ సాయి బేకరీపై పోలీసుల తనిఖీలు

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : ప్రభుత్వం నిషేధించిన హానికరమైన సింథటిక్ రంగులు, ఫ్రూట్ ఫ్లేవర్లను ఉపయోగించి ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారన్న ఆరోపణలపై కొల్తూరు గ్రామంలోని ఓ బేకరీ యజమానిపై జినోమ్ వ్యాలీ పోలీసులు కేసు నమోదు చేశారు. జినోమ్ వ్యాలీ సీఐ గోపగాని గురువయ్యగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం రాత్రి జినోమ్ వ్యాలీ పోలీసులు, ఎస్‌వోటీ కుత్బుల్లాపూర్ పోలీసులు సంయుక్తంగా కొల్తూరులోని శ్రీ సాయి బేకరీలో తనిఖీలు నిర్వహించారు.తనిఖీల్లో ప్రభుత్వం నిషేధించిన సింథటిక్ కలర్స్, మిక్స్‌డ్ ఫ్రూట్ ఫ్లేవర్స్‌కు సంబంధించిన 18.5 లీటర్ల ద్రవ పదార్థాలతో పాటు 2.5 కిలోల డీజో కోకో (చాక్లెట్ పౌడర్)ను గుర్తించారు. బేకరీలో ఉన్న కనకయ్య (40)ను అదుపులోకి తీసుకుని వివరాలు సేకరించారు. స్వాధీనం చేసుకున్న పదార్థాలను తదుపరి చర్యల నిమిత్తం సంబంధిత అధికారులకు అప్పగించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రజల ఆరోగ్యానికి హానికరమైన, ప్రభుత్వం నిషేధించిన పదార్థాలను ఆహార తయారీలో వినియోగించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ గురువయ్యగౌడ్ హెచ్చరించారు.