RJNEWS TELUGU
Date of Publish : 05 November 2026, 7:05 pm Posted by : RJ NEWS TELUGU

తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే

🔸ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీ
🔸కార్యకర్తలు, ఓటర్లే నిజమైన వీఐపీల
🔸ఐక్యతతో పనిచేస్తే రాష్ట్రంలో అధికారం ఖాయం
🔸 కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ ఈటల రాజేందర్‌

ఆర్ జె న్యూస్, మేడ్చల్‌ : తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. జవహర్‌నగర్‌ పాదయాత్రతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సభను విజయవంతం చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపేందుకు గురువారం మేడ్చల్‌లోని తన నివాస సమీపంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ పరిధిలోని మేడ్చల్‌, అర్బన్‌, సికింద్రాబాద్‌, మల్కాజ్‌గిరి ప్రాంతాల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో కార్యకర్తల కృషి మరువలేనిదన్నారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ఇందిరాపార్కు వద్ద 48 గంటల పాటు ధర్నా నిర్వహించామని గుర్తుచేశారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో పేదల ఇళ్లు కూల్చకుండా బీజేపీ నాయకులు బస్తీల్లోనే 24 గంటల పాటు ఉండి వారికి అండగా నిలిచారని తెలిపారు. దుండిగల్‌, బౌరంపేట ప్రాంతాల్లో పేదల అసైన్డ్‌ భూముల పరిరక్షణకు పోరాడామని, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం నిరంతరం కృషి చేస్తున్నామని వివరించారు.

కార్యకర్తలే పార్టీకి బలం

పార్టీలో నిజమైన వీఐపీలు ఇద్దరేనని.. పార్టీ కోసం శ్రమించే నాయకులు, కార్యకర్తలు ఒకరైతే, పార్టీకి ఓటు వేసి ఆశీర్వదించే ప్రజలు మరొకరని ఈటల అన్నారు. కష్టకాలంలో పార్టీ జెండా మోసిన కార్యకర్తలను ఎప్పటికీ విస్మరించబోమని స్పష్టం చేశారు. గ్రామస్థాయి కార్యకర్తకు ఇచ్చే గౌరవమే పైస్థాయి నాయకుడికీ ఉండాలన్నారు. చిరునవ్వు, ప్రేమ, ఆత్మీయ పలకరింపు, కలుపుగోలుతనం ఉన్నప్పుడే నాయకుడిగా గుర్తింపు లభిస్తుందని సూచించారు.

ఐక్యతతోనే విజయం

పార్టీలో అంతర్గత విభేదాలకు తావివ్వకుండా అన్నదమ్ముల్లా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు బలంగా ఉంటేనే ఎన్నికల్లో విజయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఇతర పార్టీల నుంచి ఓట్లు వస్తాయనే భ్రమలో ఉండకుండా సొంత బలాన్ని పెంచుకోవాలని సూచించారు. ప్రజల సమస్యలపై నిరంతరం స్పందిస్తూ, ప్రజల అంచనాలకు అనుగుణంగా పనిచేస్తే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్‌, మాజీ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి, మేడ్చల్‌ మున్సిపల్‌ అధ్యక్షురాలు జల్లి శైలజ హరినాథ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు జగన్‌గౌడ్‌, జిల్లా కోశాధికారి లవంగ శ్రీకాంత్‌, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సంధ్యారెడ్డి, యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు రాగం అర్జున్‌, కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడు రాజురెడ్డి తదితరులు పాల్గొన్నారు.