🔸పాత కక్షలే హత్యకు కారణం : మల్కాజిగిరి సీపీ సుమతి
ఆర్ జె న్యూస్, నాగోల్ : నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ సుప్రీం వైన్స్ వద్ద జరిగిన దారుణ హత్య కేసును ఎస్ఓటీ, నాగోల్ పోలీసులు ఛేదించినట్లు మల్కాజిగిరి సీపీ సుమతి తెలిపారు. ఈ నేరంలో పాలు పంచుకున్న మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు ఆమె మీడియా సమావేశంలో వెల్లడించారు.
మృతుడు మహ్మద్ నయీమ్.. కారు డ్రైవర్‌గా పనిచేస్తూ బండ్లగూడ నాగోల్‌లో నివాసం ఉంటున్నాడు. ఇతను పాత నేరస్తుడు కాగా ఇల్లందు పీఎస్‌లో రౌడీషీట్ ఉంది. నయీమ్‌పై గతంలో 11 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇల్లందులో మర్డర్ కేసులో కూడా ఉన్నాడు.
పరిచయం నుంచి కక్ష వరకు..
మాదాపూర్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో నయీమ్‌కు రబ్బానీతో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఒకే మతానికి చెందిన వారు కావడంతో సన్నిహితంగా ఉండేవారు. ఇద్దరూ ఒకే గదిలో ఉండేవారు. నయీమ్ తాగిన తర్వాత రబ్బానీని, అతని తల్లిదండ్రులను దూషించేవాడు. దీంతో రబ్బానీ అతని నుంచి వెళ్లిపోవాలనుకున్నాడు. అయితే వెళ్లిపోతే చంపేస్తానని, సోషల్ మీడియాలో పరువు తీస్తానని నయీమ్ బెదిరించేవాడు.
మృతుడు మహ్మద్ నయీమ్, నిందితులు ఉమా మహేష్, సయ్యద్ రబ్బానీ, ఓట్ల దినకర్ చిన్ననాటి స్నేహితులు. గతంలో వీరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉండేవి. గత రెండు నెలలుగా నయీమ్‌కు, ఉమా మహేష్, రబ్బానీ, దినకర్‌ల మధ్య విభేదాలు పెరిగాయి. నయీమ్ వారిని ఫోన్‌లో, కామన్ ఫ్రెండ్స్ సమక్షంలో బెదిరిస్తూ, దూషించేవాడు. సోషల్ మీడియాలో కుటుంబ సభ్యులను దూషిస్తూ పోస్టులు పెడతానని బెదిరించేవాడు.
పక్కా పథకంతో హత్య..
దీంతో నయీమ్‌ను హత్య చేయాలని కనకం ఉమా మహేష్, రబ్బానీ కుట్ర పన్నారు. రబ్బానీ తన మాజీ జైలు సహచరుడు రసుమల్ల సాకేత్ సహాయం కోరాడు. 2024-25లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సమయంలో నయీమ్ తనను వేధించాడనే కారణంతో సాకేత్‌కు కూడా నయీమ్‌పై కక్ష ఉంది. సాకేత్ ద్వారా వొల్లిపొల్ల మహేష్, అతని సహచరులు హత్యకు సహకరించారు. సెప్టెంబర్ 13న రబ్బానీ, మహేష్, రాఘవేందర్, వెంకట్, ఇస్మాయిల్ జబీ ఎల్బీనగర్ నుంచి ఖమ్మం వెళ్లారు. అక్కడ దినకర్, బద్రి, ఉమా మహేష్‌లను కలిసి హోటల్‌లో బస చేశారు. అక్కడే నయీమ్‌ను ఎలా హత్య చేయాలనే దానిపై ప్లాన్ చేశారు. అదే రోజు దినకర్ వారికి ఒక కారు ఏర్పాటు చేశాడు. 14వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో నిందితులు ఎల్బీనగర్‌కు చేరుకున్నారు. రెండు బైకులు, కారులో బండ్లగూడలోని సుప్రీం వైన్స్ సమీపానికి వెళ్లారు. అక్కడ సాకేత్, చరణ్ గౌడ్, కార్తీక్‌లను కలిశారు. నయీమ్ వైన్స్‌లో ఉన్న సమయంలో మొదట అతని కళ్లలో కారం చల్లారు. అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా నిందితులు వెంబడించి వేట కొడవలితో దాడి చేశారు. అనంతరం అక్కడ ఉన్న ఇనుప కడాయి, పాన్‌తో తలపై బలంగా కొట్టారు. తీవ్ర గాయాల కారణంగా నయీమ్ అక్కడికక్కడే మృతి చెందాడు. పబ్లిక్‌లో హత్య చేస్తే తప్పించుకోవచ్చని నిందితులు ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్యకు ఉపయోగించిన వేట కొడవలి, ఇనుప కడాయి, సుత్తిని స్వాధీనం చేసుకున్నట్లు సీపీ సుమతి వెల్లడించారు.