RJNEWS TELUGU
Newspaper Banner

“చైర్‌పర్సన్ శిరీష నియంతలా వ్యవహరిస్తున్నారు.. ప్రజాప్రతినిధుల గౌరవాన్ని కాలరాస్తున్నారు” స్థానిక కౌన్సిలర్‌ను పక్కనపెట్టి ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం.

మేడ్చల్ ( ఆర్ జె న్యూస్ ):అలియాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ శిరీష వ్యవహార శైలి రోజురోజుకూ నియంతృత్వాన్ని తలపిస్తోందని 7వ వార్డు కౌన్సిలర్ వెంకటేష్ తీవ్రస్థాయిలో ఆరోపించారు. ప్రజల ఓట్లతో గెలిచిన స్థానిక కౌన్సిలర్‌కు కనీస సమాచారం ఇవ్వకుండా, ఆహ్వానించకుండా 7వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రజాస్వామ్య విలువలను కాలరాయడమేనని మండిపడ్డారు.గతంలోనూ ఇదే విధంగా స్థానిక ప్రజాప్రతినిధులను అవమానిస్తూ కార్యక్రమాలు నిర్వహించగా తాము తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసి మందలించినప్పటికీ, చైర్‌పర్సన్ తన తీరు మార్చుకోలేదని విమర్శించారు. ప్రజలతో నిత్యం మమేకమై సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న కౌన్సిలర్లను ఉద్దేశపూర్వకంగానే పక్కనబెడుతూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వెనుక రాజకీయ కక్ష సాధింపే కారణమని ఆరోపించారు.మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ ఒక్కరే ప్రజాప్రతినిధి కాదని, ప్రతి వార్డుకు ఎన్నికైన కౌన్సిలర్‌కు గౌరవం, హక్కులు ఉంటాయని వెంకటేష్ పేర్కొన్నారు. అధికార మదంతో స్థానిక ప్రజాప్రతినిధులను అవమానించడం ఎంతమాత్రం సమంజసం కాదని, ఈ ధోరణిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.ఇకపై ఇలాంటి చర్యలు కొనసాగితే వార్డు ప్రజలతో కలిసి పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, అవసరమైతే ఉన్నతాధికారులు, ప్రభుత్వ దృష్టికి కూడా ఈ వ్యవహారాన్ని తీసుకెళ్తామని హెచ్చరించారు. చైర్‌పర్సన్ నియంతృత్వ ధోరణిని సహించబోమని, ప్రజాస్వామ్య పద్ధతులను పాటించాలని వెంకటేష్ డిమాండ్ చేశారు.