🔸హామీల పేరుతో ప్రజలను మోసం చేశారు
🔸వంటావార్పుతో బీఆర్ఎస్ నిరసన
ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చాక ప్రజలకు మొండిచేయి చూపిందని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి చామకూర మహేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, మాజీ కోఆప్షన్ సభ్యుడు నవీన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనకు నిరసనగా బీఆర్ఎస్ చేపడుతున్న ఆందోళనల్లో భాగంగా శుక్రవారం మేడ్చల్‌లో భారీ ఎత్తున వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరు గ్యారంటీలు, 420 హామీల పేరుతో ప్రజలను నమ్మించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల అమలును పూర్తిగా గాలికొదిలేసిందని విమర్శించారు. రైతుబంధు, రుణమాఫీ, రైతు బీమా వంటి కీలక పథకాల అమలులో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.
ఎన్నికల సమయంలో ఆసరా పింఛన్లను రూ.2,016 నుంచి రూ.4 వేలకు పెంచుతామని చెప్పి మాట తప్పిందని ఆరోపించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద తులం బంగారంతో పాటు అదనపు ఆర్థిక సాయం అందిస్తామని ఇచ్చిన హామీలను కూడా అమలు చేయలేదన్నారు. మహిళలకు స్కూటర్లు, నిరుద్యోగులకు ఉద్యోగ భృతి, రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించి యువతను మోసం చేశారని ధ్వజమెత్తారు.
🔸కరెంట్.. నీళ్లకు కష్టాలు..
బీఆర్ఎస్ హయాంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందించడంతో పాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా తాగునీటి సరఫరా జరిగేదని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్, తాగునీటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. రైతుబంధు మొత్తాన్ని పెంచకపోగా కోతలు పెడుతున్నారని విమర్శించారు.
అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని, ఈ దగా పాలనకు పతనం తప్పదని హెచ్చరించారు. ప్రజల జీవితాలు బాగుపడాలంటే మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, వచ్చేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నవీన్‌రెడ్డి, తుడుం గణేశ్, నడికొప్పు నాగరాజు, మోహన్‌రెడ్డి, మండల ఈశ్వరయ్య, మండల రవికుమార్, కోల వెంకటేశ్, వరలక్ష్మి, పద్మ, శారద, వసంత, లావణ్యగౌడ్, బాబు యాదవ్, చంద్రశేఖర్‌రెడ్డి, మహేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.