RJNEWS TELUGU
Date of Publish : 05 September 2026, 9:11 pm Posted by : RJ NEWS TELUGU

శాంతియుత గణేష్ ఉత్సవాలకు సహకరించాలి

🔸మండప నిర్వాహకులకు కీసర పోలీసుల అవగాహన
ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు మండప నిర్వాహకులు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని జవహర్ నగర్ ఏసీపీ చక్రపాణి సూచించారు. గణేష్ విగ్రహాల ఏర్పాటు, ఉత్సవాల నిర్వహణ, నిమజ్జనం, భద్రతా చర్యలు, నియమ నిబంధనలపై మండప నిర్వాహకులు, గ్రామ ప్రజలు, కాలనీ అసోసియేషన్ సభ్యులకు అవగాహన కల్పించేందుకు శనివారం కీసర పోలీస్‌ స్టేషన్‌లో కార్యక్రమం నిర్వహించారు. కీసర పోలీస్‌ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఆర్కపల్లి ఆంజనేయులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏసీపీ చక్రపాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏసిపి మాట్లాడుతూ.. మండపాల ఏర్పాటుకు ముందుగా సంబంధిత అనుమతులు తీసుకోవాలని, ప్రభుత్వ మార్గదర్శకాలు, పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మండపాల వద్ద విద్యుత్ భద్రత, లౌడ్‌స్పీకర్ల వినియోగం, ట్రాఫిక్ నియంత్రణ, నిమజ్జనం సమయంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై నిర్వాహకులకు అవగాహన కల్పించారు. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి గొడవలు, వివాదాలు, అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో,ఆనందోత్సాహాలతో, సామరస్యపూర్వక వాతావరణంలో నిర్వహించాలని కీసర పోలీసులు విజ్ఞప్తి చేశారు. నిమజ్జనం సమయంలో పోలీసుల సూచనలు పాటిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని మండప నిర్వాహకులు, భక్తులను కోరారు. శాంతియుత గణేష్ ఉత్సవాలు – అందరి బాధ్యత అనే సందేశంతో ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని పోలీసులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది, గ్రామ ప్రజలు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, వివిధ గణేష్ మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.