RJNEWS TELUGU
Date of Publish : 19 September 2026, 9:05 pm Posted by : RJ NEWS TELUGU

భారీ వర్షాలు, గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు శనివారం బంజారాహిల్స్‌లోని టీ-జీఐసీసీసీ (కమాండ్ కంట్రోల్ సెంటర్)ను సందర్శించి పరిస్థితులను సమీక్షించారు. భారీ వర్షాలతో పాటు నగరంలో జరగనున్న గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఏర్పాట్లను కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పరిశీలించారు. బాలాపూర్ నుంచి ప్రారంభమయ్యే ప్రధాన శోభాయాత్ర మార్గాల్లో రహదారుల పరిస్థితి, మరమ్మతులు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నియంత్రణ, నీరు నిలిచే ప్రాంతాల్లో చేపట్టిన చర్యలపై ఆరా తీశారు. టీ-జీఐసీసీసీ ఇన్‌చార్జ్ అధికారి కమల్ హాసన్ రెడ్డి రియల్‌టైమ్ పర్యవేక్షణ, శోభాయాత్ర మార్గాల్లో చేపట్టిన నిఘా ఏర్పాట్లను సీఎస్‌కు వివరించారు. శోభాయాత్ర మార్గాల్లో సీసీటీవీ కెమెరాల ద్వారా చేపడుతున్న నిఘాను పరిశీలించిన సీఎస్, కీలక ప్రాంతాలు, రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలు, నిమజ్జన ప్రాంతాల్లో నిఘాను మరింత పటిష్టం చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించాలని, దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. వర్షాల కారణంగా శోభాయాత్రకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, భక్తులకు ఇబ్బందులు లేకుండా పారిశుద్ధ్యం, ట్రాఫిక్, విద్యుత్, వైద్య సేవలను సమన్వయంతో అందుబాటులో ఉంచాలని సీఎస్ ఆదేశించారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించాలని సీఎస్ సంజయ్ జాజు స్పష్టం చేశారు.