RJNEWS TELUGU
Date of Publish : 04 November 2026, 5:05 pm Posted by : RJ NEWS TELUGU

ప్రతి ఇందిరమ్మ ఇంటా దీపావళి వెలుగులు!

🔸రాష్ట్రవ్యాప్తంగా 2,21,500 ఇళ్లలో గృహప్రవేశాలు పూర్తి

🔸మరో 1.90 లక్షల ఇళ్లు నిర్మాణ దశలో.. రూ.40 వేల కోట్లతో ఇళ్ల నిర్మాణం

🔸పేదల ఆత్మగౌరవానికి ప్రతీక ఇందిరమ్మ ఇళ్లు : మంత్రి పొంగులేటి

ఆర్ జె న్యూస్, మేడ్చల్‌ : నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ దీపావళి పండుగను రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లలోనే జరుపుకోవాలని లబ్ధిదారులు, అధికారులు, ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. పేదల ఇళ్లలో వెలిగే ప్రతి దీపం ప్రజాప్రభుత్వ సంకల్పానికి ప్రతీకగా నిలవాలని ఆకాంక్షించారు.
బుధవారం మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా కేంద్రంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఆర్థిక అవరోధాలు ఎదురైనా పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం కొనసాగిస్తోందన్నారు. తొలి విడతలో మంజూరు చేసిన 4.50 లక్షల ఇళ్లలో ఇప్పటివరకు 2,21,500 ఇళ్లలో గృహప్రవేశాలు పూర్తయ్యాయని, మరో 1.90 లక్షల ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని వెల్లడించారు.గృహప్రవేశాలు పూర్తిచేసుకున్న ఇళ్లకు దీపావళి రోజున ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, గృహనిర్మాణ శాఖ అధికారులు, ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు వెళ్లి లబ్ధిదారుల కుటుంబాలతో పండుగ వేడుకల్లో పాల్గొనాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు’ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
తొలి విడతలో 4.50 లక్షలు, రెండో విడతలో 2.50 లక్షల ఇళ్లతో పాటు హైదరాబాద్‌ క్యూర్‌ ఏరియా పరిధిలో లక్ష ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్‌ తరహాలో నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, నల్గొండ నగరాల్లోనూ జీ+5 విధానంలో ఇందిరమ్మ టవర్ల నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను దీపావళిలోగా జారీ చేస్తామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా రూ.40 వేల కోట్లతో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేది లేదని స్పష్టం చేశారు. ప్రతి సోమవారం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నిధులు జమ చేస్తున్నామని, అవినీతికి తావులేకుండా పారదర్శకంగా పథకాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. నగరాలు, పట్టణాలు, గ్రామాలతో పాటు మారుమూల ప్రాంతాలు, గిరిజన తండాల్లోనూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొనసాగుతోందన్నారు.ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు గాంధీ,పాయల శంకర్‌, ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.