RJNEWS TELUGU
Date of Publish : 10 September 2026, 9:00 pm Posted by : RJ NEWS TELUGU

మరుగుదొడ్ల అపరిశుభ్రతపై డీఎంహెచ్‌వో ఆగ్రహం

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యం, పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం వహించవద్దని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డా. కె. ఆనంద్ సూచించారు. హస్మత్‌పేట్‌లోని మండల పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం ఆయన సందర్శించి విద్యార్థుల ఆరోగ్యం, పోషణ, పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. పాఠశాలలోని ఆహార నిల్వల స్టాక్‌ రిజిస్టర్‌ను తనిఖీ చేసి కూరగాయల నాణ్యతను పరిశీలించారు. వంటశాలను సందర్శించి భోజన తయారీలో పాటిస్తున్న పరిశుభ్రత, ఆహార నాణ్యత, వంటగది నిర్వహణను పరిశీలించారు. పాఠశాల మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని ప్రధానోపాధ్యాయుడికి సూచించారు. అపరిశుభ్రతతో విద్యార్థులకు వ్యాధులు సోకే అవకాశం ఉందని హెచ్చరించారు. అనంతరం పాఠశాలలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని పరిశీలించారు. ఆర్‌బీఎస్‌కే బృందాలు చేపడుతున్న వైద్య పరీక్షల రికార్డులను తనిఖీ చేశారు. SAM, MAM పిల్లలను గుర్తించడం, వారి ఆరోగ్య వివరాల నమోదు, వారికి అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంపై అవగాహన కల్పించారు. పాఠశాలలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా సిబ్బంది నిరంతరం చర్యలు తీసుకోవాలని డా. ఆనంద్ సూచించారు.