RJNEWS TELUGU
Date of Publish : 11 September 2026, 9:03 pm Posted by : RJ NEWS TELUGU

అనధికార ఆసుపత్రులపై డీఎంహెచ్‌వో కొరడా

🔸మేడ్చల్‌లో రెండు ఆసుపత్రులు సీజ్‌..
🔸స్వరూప నర్సింగ్‌ హోమ్‌కు నోటీసులు
ఆర్.జె.న్యూస్, మేడ్చల్‌ : నిబంధనలు పాటించకుండా వైద్య సేవలు అందిస్తున్న ఆసుపత్రులపై వైద్యారోగ్య శాఖ అధికారులు కొరడా ఝళిపించారు. మేడ్చల్‌ పరిధిలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించిన చిన్న హాస్పిటల్‌, సాక్షి హాస్పిటల్‌లను సీజ్‌ చేశారు.జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌వో) డాక్టర్‌ ఆనంద్‌ ఆధ్వర్యంలో అధికారులు ఆయా ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రుల నిర్వహణకు అవసరమైన అనుమతులు, రిజిస్ట్రేషన్‌ తదితర అంశాలను పరిశీలించగా నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నట్లు గుర్తించిన నేపథ్యంలో రెండు ఆసుపత్రులపై చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.అదేవిధంగా మేడ్చల్‌లోని స్వరూప నర్సింగ్‌ హోమ్‌ను కూడా అధికారులు సందర్శించి తనిఖీలు చేపట్టారు. నర్సింగ్‌ హోమ్‌ రిజిస్టర్‌ అయి ఉన్నప్పటికీ, సంబంధిత రిజిస్ట్రేషన్‌, నిర్వహణకు సంబంధించిన పత్రాలను పూర్తిస్థాయిలో పరిశీలించాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ మేరకు డాక్యుమెంట్ల వెరిఫికేషన్‌ కోసం నోటీసులు జారీ చేసినట్లు డీఎంహెచ్‌వో ఆనంద్‌ వెల్లడించారు.ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ అనుమతులు లేకుండా వైద్య సేవలు అందించే సంస్థలపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. నిబంధనలు పాటించకుండా ఆసుపత్రులు, నర్సింగ్‌ హోమ్‌లు, క్లినిక్‌లు నిర్వహిస్తున్న వారిపై తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.