RJNEWS TELUGU
Date of Publish : 20 September 2026, 6:12 pm Posted by : RJ NEWS TELUGU

ఎల్లారెడ్డిగూడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

మట్టి దిబ్బను తప్పించబోయి స్కూటీ స్కిడ్.. టిప్పర్ వెనుక చక్రాల కింద పడి దుర్మరణం

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : ఎల్లారెడ్డిగూడలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీపై వెళ్తున్న యువతి, బాలుడు టిప్పర్ వెనుక చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడ రాయల్ ఇరానీ కేఫ్ సమీపంలో చోటుచేసుకుంది.పోలీసుల వివరాల ప్రకారం.. కాప్రాకు చెందిన మార్తల సూర్య నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి శనివారం రాత్రి తన అపార్ట్‌మెంట్‌లో గణేష్ పూజ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఎల్లారెడ్డిగూడకు చెందిన గంధం అమర్త్య (15) అక్కడికి వచ్చి, తమ గణేష్ మండపం వద్ద అన్నదాన కార్యక్రమం జరుగుతోందని తెలిపాడు.
దీంతో సూర్య నారాయణ రెడ్డి కుమార్తె మార్తల వెంకట దీప్సిఖా రెడ్డి (21), గంధం అమర్త్య కలిసి TS08ER9766 నంబర్ గల ఆక్టివా స్కూటీపై శాలివాహన ఎన్‌క్లేవ్ వైపు బయలుదేరారు. రాత్రి సుమారు 9.30 గంటలకు రాయల్ ఇరానీ కేఫ్ సమీపంలో రోడ్డుపై ఉన్న మట్టి దిబ్బను తప్పించుకునే క్రమంలో స్కూటీ అదుపుతప్పి స్కిడ్ అయింది. అదే సమయంలో కాప్రా నుంచి ఎల్లారెడ్డిగూడ వైపు మట్టితో వెళ్తున్న TG12T3335 నంబర్ గల టిప్పర్ వెనుక వైపున ఇద్దరూ పడిపోయారు. టిప్పర్ వెనుక టైర్లు దీప్సిఖాపై నుంచి వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. అమర్త్యకు తీవ్ర తల గాయం కావడంతో అతడూ ఘటనాస్థలంలోనే మృతి చెందాడు.
టిప్పర్‌ను నడుపుతున్న బాలాజీనగర్‌కు చెందిన గుంజ నరసింహ (28)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.