🔸టార్పాలిన్ కడుతుండగా మరో లారీ ఢీకొని వ్యక్తి మృతి
ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : లారీపైకి ఎక్కి టార్పాలిన్ కడుతున్న లారీని వెనుక నుంచి మరో భారీ క్రషర్ లోడుతో వచ్చిన లారీ ఢీకొట్టడంతో లారీ ఎక్కిన వ్యక్తి కిందపడి అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చెన్నై నుంచి ప్లైవుడ్ లోడుతో మియాపూర్ వెళ్తున్న టీఎస్ 05 యూసీ 2959 నంబర్ గల టిప్పర్ లారీ తెల్లవారుజామున సుమారు 3:30 నుంచి 4:00 గంటల మధ్య వర్షం రావడంతో లారీని పక్కన నిలిపి లారీలో ఉన్న ప్లైవుడ్ తడవకుండా ఉండేందుకు బీహారీ రాయ్ (35) లారీ పైకెక్కి టార్పాలిన్ కడుతున్నాడు. అదే సమయంలో కీసర నుంచి తెల్లాపూర్ వైపు అధిక క్రషర్ లోడుతో వెళ్తున్న టీజీ 07 ఎక్స్ 5510 అనే నంబర్ గల 16 టైర్ల లారీ వెనుక నుంచి వేగంగా వచ్చి ప్లైవుడ్ లోడుతో ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ పైనుంచి కిందపడిన బీహారీ రాయ్ తల పగలడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.