RJNEWS TELUGU
Date of Publish : 19 September 2026, 9:30 am Posted by : RJ NEWS TELUGU

ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం

టైరు మార్చుతుండగా లారీ ఢీ.. ఇద్దరు మృతి

మరో కార్మికుడికి తీవ్ర గాయాలు.. ప్రమాదం తర్వాత లారీ డ్రైవర్‌ పరారీ

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : శామీర్‌పేట ఓఆర్‌ఆర్‌పై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పంక్చర్‌ అయిన వాహనానికి టైరు మారుస్తుండగా వెనుక నుంచి వచ్చిన టాటా లారీ ఢీకొట్టడంతో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.పోలీసుల వివరాల ప్రకారం.. చెంగుంట నుంచి స్క్రాప్‌ లోడ్‌తో అశోక్‌ లేలాండ్‌ వాహనం (TS 09 UD 3611) కీసర వైపు బయలుదేరింది. ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌ నంబర్‌ 6 నుంచి శామీర్‌పేట వైపు వెళ్లారు. లియోనియా ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి దాటిన తర్వాత సుమారు 300 మీటర్ల దూరంలో వాహనం కుడివైపు వెనుక టైరు పంక్చర్‌ కావడంతో అత్యవసర లేన్‌లో నిలిపారు.టైరు మార్చేందుకు రింకు, ఇబ్రహీం జాకీ రాడ్‌తో ప్రయత్నిస్తుండగా.. ఇస్మాయిల్‌ హుస్సేన్‌ వాహనం కింద టార్చ్‌ వెలుతురులో పనిచేస్తున్నాడు. అశోక్‌, భీమ్‌షా వాహనానికి ఆధారంగా ఉంచేందుకు రాళ్లు తెచ్చేందుకు వెళ్లారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన టాటా ట్రక్‌ (TS 15 UD 8932) నిలిపి ఉన్న అశోక్‌ లేలాండ్‌ను ఢీకొట్టింది.ప్రమాదంలో రింకు, ఇబ్రహీం, ఇస్మాయిల్‌ హుస్సేన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. రింకు, ఇస్మాయిల్‌ హుస్సేన్‌ అక్కడికక్కడే మృతి చెందగా.. ఇబ్రహీంను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.ప్రమాదం అనంతరం టాటా ట్రక్‌ డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. అతడి పేరు నాగరాజుగా, మియాపూర్‌ వాసిగా భీమ్‌షా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
మృతుడు ఇస్మాయిల్‌ సోదరుడు మహ్మద్‌ హుస్సేన్‌ ఫిర్యాదు మేరకు శామీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణాలు, పరారైన డ్రైవర్‌ ఆచూకీపై పోలీసులు విచారణ చేపట్టారు.