🔸మెడినోవా సూపర్ స్పెషాలిటీ
🔸ఆస్పత్రిలో ఆరు పడకలతో ఏర్పాటు
🔸లోటస్ హాస్పిటల్స్ సాంకేతిక సహకారం
ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ పట్టణంలో తొలిసారిగా అత్యాధునిక నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU) అందుబాటులోకి వచ్చింది. మెడిసిటీ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్‌కు చెందిన మెడినోవా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో లోటస్ హాస్పిటల్స్ సాంకేతిక సహకారంతో ఈ లెవల్–3 NICUను ఏర్పాటు చేశారు.
ప్రముఖ పీడియాట్రిషియన్, లోటస్ హాస్పిటల్స్ వ్యవస్థాపకులు డా. వి.ఎస్.వి. ప్రసాద్ శుక్రవారం ఉదయం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో NICUను ప్రారంభించారు. ఆరు పడకలతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్‌లో అప్పుడే పుట్టిన శిశువులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు అధునాతన సదుపాయాలను కల్పించారు.నెలలు నిండకముందే జన్మించిన శిశువులు, తక్కువ బరువుతో పుట్టిన పిల్లలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఆక్సిజన్ అవసరం, ఇన్ఫెక్షన్లు, పాలు తాగలేని పరిస్థితులు వంటి సమస్యలకు ఇక్కడ అత్యవసర చికిత్స అందించనున్నారు. శ్వాసకోశ చికిత్స, వెంటిలేటర్, ఇంక్యుబేటర్, ఉష్ణ సంరక్షణ తదితర సదుపాయాలు అందుబాటులో ఉంటాయని ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది.ఈ సందర్భంగా డా. వి.ఎస్.వి. ప్రసాద్ మాట్లాడుతూ.. అప్పుడే పుట్టిన శిశువులకు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే చికిత్స అందించడం ఎంతో కీలకమన్నారు. ఇలాంటి అత్యాధునిక వైద్య సదుపాయాన్ని మేడ్చల్‌లో తొలిసారిగా అందుబాటులోకి తీసుకురావడంఅభినందనీయమన్నారు. అత్యవసర చికిత్స స్థానికంగానే అందుబాటులో ఉంటే విలువైన ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
🔸సేవలు అందుబాటులో కి
ఈ NICU సేవలు శుక్రవారం నుంచే రోగులకు అందుబాటులోకి వస్తాయని ఆస్పత్రి యాజమాన్యం వెల్లడించింది. మేడ్చల్ పరిసర ప్రాంతాల ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరింది.కార్యక్రమంలో మెడిసిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కె. శివరామకృష్ణ, మెడిసిటీ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ CEO శ్రీ ఐనిష్ మర్చంట్, మెడిసిటీ హాస్పిటల్స్, ఘన్‌పూర్ డైరెక్టర్ (మెడికల్ అడ్మినిస్ట్రేషన్) డా. సి. గీతతో పాటు మెడిసిటీ, మెడినోవా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌కు చెందిన వైద్యులు, వైద్యేతర సిబ్బంది పాల్గొన్నారు.
