RJNEWS TELUGU
Date of Publish : 11 September 2026, 8:56 pm Posted by : RJ NEWS TELUGU

గ్రంథాలయ సెస్‌ వసూళ్లపై దృష్టి

🔸బకాయిలను నెలకు రూ.2 లక్షల చొప్పున చెల్లించాలి

🔸ఐదు నెలల్లో రూ.5 కోట్లకు పైగా వసూలు

ఆర్.జె.న్యూస్, మేడ్చల్‌ : గ్రంథాలయ సెస్‌ బకాయిల వసూళ్లపై అధికారులు దృష్టి సారించారు. జిల్లాలోని వివిధ మున్సిపాలిటీల వద్ద పెండింగ్‌లో ఉన్న సెస్‌ బకాయిలను విడతల వారీగా చెల్లించేలా చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) ఫైజన్‌ అహ్మద్‌ ఆదేశించారు. శుక్రవారం ఆయన ఛాంబర్‌లో జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో సెస్‌ వసూళ్లు, బకాయిలు, గ్రంథాలయాల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు.మున్సిపాలిటీల వద్ద పెండింగ్‌లో ఉన్న బకాయిలను ప్రతి నెల రూ.2 లక్షల చొప్పున చెల్లించాలని అదనపు కలెక్టర్‌ సూచించారు. సెస్‌ వసూళ్లు, బకాయిలు, చెల్లింపుల వివరాలను ప్రతినెలా జిల్లా గ్రంథాలయ సంస్థకు అందజేయాలని ఆదేశించారు. బకాయిలను సంస్థల వారీగా గుర్తించి ప్రత్యేక కార్యాచరణతో వసూలు చేయాలని పేర్కొన్నారు.

లక్ష్యాన్ని దాటిన వసూళ్లు

2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.4 కోట్ల సెస్‌ వసూలు లక్ష్యాన్ని నిర్దేశించగా.. ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు ఐదు నెలల్లోనే రూ.5 కోట్లకు పైగా వసూలు కావడంపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన నెలల్లోనూ వసూళ్లను మరింత పెంచి లక్ష్యాన్ని అధిగమించాలని సూచించారు.

జీహెచ్‌ఎంసీ బకాయిలపై చర్యలు

జీహెచ్‌ఎంసీ నుంచి గతంలో ప్రతి నెల సుమారు రూ.5 లక్షల సెస్‌ అందేదని, ఏప్రిల్‌ 2026 నుంచి ఇప్పటి వరకు చెల్లింపులు నిలిచిపోయాయని సమావేశంలో చర్చించారు. పెండింగ్‌ మొత్తాన్ని వెంటనే విడుదల చేసేలా సంబంధిత అధికారులకు లేఖలు రాయాలని నిర్ణయించారు.

రీడింగ్‌ రూమ్‌ల ఏర్పాటుకు సూచన

విద్యార్థులు, యువత, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం మున్సిపాలిటీల పరిధిలో పబ్లిక్‌ రీడింగ్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. చదువుకునేందుకు అనువైన వాతావరణంతోపాటు పత్రికలు, పోటీ పరీక్షల పుస్తకాలు, ఇతర అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు స్థానిక సంస్థలు సహకరించాలని కోరారు.గ్రంథాలయ సెస్‌ ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రంథాలయాల అభివృద్ధి, పాఠకులకు మెరుగైన సౌకర్యాలు, విద్యార్థులు, యువతకు అధ్యయన వసతుల కల్పనకు వినియోగిస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ బొంగునూరి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.సెస్‌ వసూళ్లు, బకాయిల పరిస్థితిపై ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్ష నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ బొంగునూరి శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్లు, సంస్థ కార్యదర్శి పేరం సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.