🔸నూతన భవన సముదాయానికి భూమిపూజ చేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ప్రజలు, న్యాయవాదులకు న్యాయసేవలను మరింత సులభతరం చేసేందుకు చేపట్టిన నూతన జిల్లా కోర్టు భవన సముదాయ నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన జరిగింది. మేడ్చల్ జీహెచ్ఎంసీ పరిధిలో కండ్లకోయ గ్రామంలో నిర్మించనున్న సమగ్ర కోర్టు కాంప్లెక్స్ నిర్మాణ పనులకు న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె. లక్ష్మణ్, జస్టిస్ టి. విజయసేన్ రెడ్డి, జస్టిస్ నందికొండ నర్సింగరావు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా నూతన కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం పూర్తయితే న్యాయవాదులు, కక్షిదారులకు ఆధునిక మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని, కేసుల విచారణ ప్రక్రియ మరింత సులభతరం, వేగవంతం అవుతుందని అతిథులు పేర్కొన్నారు. జిల్లా విస్తరణకు అనుగుణంగా న్యాయ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఈ నూతన భవన సముదాయం దోహదపడుతుందని తెలిపారు.కార్యక్రమంలో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి. బాల భాస్కరరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హనుమంత రెడ్డి, అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు, రెవెన్యూ అధికారులు, న్యాయవ్యవస్థకు చెందిన పలువురు న్యాయమూర్తులు, కోర్టు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.