కొర్రెములలో జీవన్ ప్రమాణ్ శిబిరం ఏర్పాటు
ఆర్ జె న్యూస్, ఘట్‌కేసర్ : సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు, వారి జీవిత భాగస్వాములకు ఉచితంగా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు అందించేందుకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కొర్రెముల సుప్రభాత్ టౌన్‌షిప్‌లో ఆదివారం ప్రత్యేక శిబిరం నిర్వహించారు. సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో జీవన్ ప్రమాణ్ యాప్ ద్వారా ధ్రువపత్రాలను సమర్పించే సేవలు అందించారు. సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు కోల్ మైన్స్ పెన్షన్ నిరంతరాయంగా పొందాలంటే ప్రతి ఏటా నవంబరులో లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుందని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆళవందార్ వేణు మాధవ్ తెలిపారు. సింగరేణి యాజమాన్యం అందిస్తున్న కార్పొరేట్ పోస్ట్ రిటైర్‌మెంట్ మెడికేర్ పథకం కింద వైద్య బీమా సదుపాయం పొందేందుకు ఉద్యోగితో పాటు వారి జీవిత భాగస్వామి కూడా ధ్రువపత్రాలు సమర్పించడం తప్పనిసరని పేర్కొన్నారు. ఇంటర్నెట్ కేంద్రాల్లో డిజిటల్ ధ్రువపత్రాల సమర్పణలో సాంకేతిక సమస్యలు, అవగాహన లోపం కారణంగా పెన్షనర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో పెన్షన్లు నిలిచిపోకుండా, వైద్య బీమా సదుపాయానికి ఆటంకం కలగకుండా అసోసియేషన్ ఉచిత శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు బంగారి రాజయ్య, చుక్కల నర్సయ్య, ఎం. సత్యనారాయణ, బాల్‌రెడ్డి, మక్బుల్ ఖాన్, బంగారి మల్లయ్య, ఎస్. లక్ష్మీనారాయణ, తివారీలాల్, మంజులత, బంగారి సంధ్య, బంగారి లలిత, చుక్కల పద్మ తదితరులు పాల్గొన్నారు.