RJNEWS TELUGU
Date of Publish : 03 September 2026, 6:20 pm Posted by : RJ NEWS TELUGU

గణేష్ ఉత్సవాలు సామాజిక, జాతీయ చైతన్యానికి వేదికగా నిలవాలి : ఏనుగు సుదర్శన్ రెడ్డి

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : గణేష్ ఉత్సవాలు కేవలం ఆధ్యాత్మిక వేడుకలకే పరిమితం కాకుండా సామాజిక ఐక్యత, సాంస్కృతిక పరిరక్షణ, జాతీయ చైతన్యం, ప్రజా భాగస్వామ్యానికి వేదికలుగా నిలవాలని బీజేపీ మేడ్చల్ నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ మేడ్చల్ ఉమ్మడి మండల కో-కన్వీనర్‌గా నియమితులైన చెరువుకొమ్ము శ్రీనివాస్ గౌడ్‌ను ఏనుగు సుదర్శన్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గణేష్ ఉత్సవాలను కేవలం ఆధ్యాత్మిక వేడుకలుగా కాకుండా ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చే సామాజిక, సాంస్కృతిక వేదికగా మలిచారని గుర్తు చేశారు. గణేష్ ఉత్సవాల ద్వారా ప్రజల్లో జాతీయ చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు కుల, వర్గ భేదాలకు అతీతంగా సమాజాన్ని ఏకం చేయడంలో తిలక్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో నేటి గణేష్ ఉత్సవాలను సామాజిక ఐక్యత, సాంస్కృతిక పరిరక్షణ, జాతీయ చైతన్యం, ప్రజా భాగస్వామ్యానికి మరింత బలమైన వేదికలుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల ద్వారా యువతను, ప్రజలను చైతన్యపరుస్తూ సమాజంలో సేవా భావం, దేశభక్తి, ఐక్యతను పెంపొందించే దిశగా శ్రీనివాస్ గౌడ్ తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆకాంక్షించారు. గణేష్ ఉత్సవాలు భక్తి, సంప్రదాయాలకు ప్రతీకగా కొనసాగుతూనే ప్రజలను కలిపే శక్తిగా, సమాజాన్ని చైతన్యపరిచే వేదికగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు సముద్రాల కృష్ణ గౌడ్, జవహర్ నగర్ బీజేపీ అధ్యక్షుడు కమల్, మాజీ కార్పొరేటర్ బాబు, నాయకులు అర్జున్ బాబు, వంశీధర్ రెడ్డి, బండి విష్ణు గౌడ్, రాఘవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.