ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్: సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో గంజాయి విక్రయిస్తున్న బీహార్ యువకుడిని జీడిమెట్ల పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. జీడిమెట్ల సుభాష్ నగర్ లోని రాజు బిల్డింగ్ లో గంజాయి విక్రయిస్తున్నట్లు వచ్చిన పక్కా సమాచారంతో ఎస్ఐ డి. రామచంద్రయ్య తన సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 530 గ్రాముల గంజాయి, 25 ఖాళీ ప్యాకెట్లు, ఒప్పో సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడిని బీహార్ కు చెందిన సుభాష్ కుమార్ (26) గా గుర్తించారు. ఉపాధి కోసం 8 నెలల క్రితం నగరానికి వచ్చిన అతడు, బీహార్ లో శమన్ భగత్ అనే వ్యక్తి వద్ద కిలో గంజాయిని రూ.10 వేల చొప్పున కొనుగోలు చేసి, జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో 100 గ్రాములు రూ.3 వేల చొప్పున విక్రయిస్తున్నట్లు తేలింది. ఇప్పటికే 470 గ్రాముల గంజాయిని భార్గవ్ నాయుడు, అక్రమ్ బాషా, గిరి తదితరులకు విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.