RJNEWS TELUGU
Date of Publish : 16 September 2026, 10:52 pm Posted by : RJ NEWS TELUGU

కొండాపూర్ ఓయో హోటల్‌లో గంజాయి దందా గుట్టురట్టు

🔸17.1 కిలోల గంజాయి స్వాధీనం, ఇద్దరు అరెస్ట్*

ఆర్ జె న్యూస్, కొండాపూర్ : హైదరాబాద్ కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని ఓయో హనీ హైట్స్ హోటల్‌లో సాగుతున్న గంజాయి దందాను ఎక్సైజ్ స్టేట్ టాస్క్‌ఫోర్స్ అధికారులు గుట్టురట్టు చేశారు. హోటల్ గదుల నుంచి గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 17.1 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.9 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.

పక్కా సమాచారంతో దాడులు

కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని ఓయో హోటల్ గదుల్లో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతో ఎక్సైజ్ స్టేట్ టాస్క్‌ఫోర్స్ సీఐ వెంకటేశ్వర్లు నేతృత్వంలోని బృందం బుధవారం దాడులు నిర్వహించింది.

నిందితులు అసోం వాసులు

అరెస్టైన వారిని అసోంకు చెందిన ధీరజ్ దాస్ (39), రబాలి అలీ (25)గా గుర్తించారు. గతంలో హైదరాబాద్‌లో ఇద్దరూ సెక్యూరిటీ గార్డులుగా పనిచేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. జీతాలు సరిపోవడం లేదని ఉద్యోగాలు మానేసి అనంతరం గంజాయి అక్రమ రవాణా, విక్రయాల వైపు మళ్లినట్లు విచారణలో వెల్లడైంది. నిందితులు అసోంకు వెళ్లి గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తరలించిన అనంతరం చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి హోటల్ గదుల నుంచి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అరెస్టైన ఇద్దరు నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న 17.1 కిలోల గంజాయిని తదుపరి చట్టపరమైన చర్యల కోసం కొండాపూర్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించారు. ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించిన స్టేట్ టాస్క్‌ఫోర్స్ సిబ్బందిని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అవినాష్ మహంతి, జాయింట్ కమిషనర్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) అంజన్ రావు, డీఎస్పీ తుల శ్రీనివాసరావు అభినందించారు.