ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : భవన నిర్మాణానికి అనుమతించి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహకరిస్తానని ఒక సామాన్యుడి నుండి రూ. 4 లక్షల లంచం తీసుకుంటూ జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ ‘తులసిరామ్ సునీత’ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. లంచం సొమ్ము స్వీకరిస్తుండగా తెలంగాణ ఏసీబీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని, సంచలన నగదు రికవరీ చేశారు. ఏసీబీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం… జీహెచ్ఎంసీ గోల్కొండ జోన్, సర్కిల్-33 (మెహదీపట్నం) పరిధిలో టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న సునీత, ఒక భవన నిర్మాణదారుడికి సంబంధించి జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను పక్కన పెట్టేందుకు, భవిష్యత్తులో ఎలాంటి వేధింపులు లేకుండా సహకరించేందుకు గాను రూ. 8 లక్షల లంచం డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా మొదటి విడతగా రూ. 4 లక్షల నగదును బాధితుడి నుండి తీసుకుంటుండగా ఏసీబీ బృందం మెరుపు దాడి చేసి ఆమెను పట్టుకుంది. ఈ తనిఖీల సమయంలో ఆమె వద్ద లెక్కల్లో లేని మరో రూ. 2.5 లక్షల అదనపు నగదును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో నిందితురాలి నుండి మొత్తం రూ. 6.5 లక్షల నగదును రికవరీ చేసినట్లయింది. సునీతను అరెస్ట్ చేసిన అధికారులు, నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుపై లోతైన దర్యాప్తు కొనసాగుతోందని, ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1064 కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు కోరారు.