RJNEWS TELUGU
Date of Publish : 08 August 2026, 9:12 am Posted by : RJ NEWS TELUGU

సూరజ్‌కు స్వర్ణం.. వరల్డ్ యూనివర్సిటీ స్క్వాష్‌లో భారత్‌కు తొలి గోల్డ్.. చరిత్ర సృష్టించిన సూరజ్ కుమార్ చంద్

ఆర్.జె.న్యూస్, స్పోర్ట్స్ : ఎన్ఐఎస్యూ వరల్డ్ యూనివర్సిటీ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. భారత స్క్వాష్ ప్లేయర్ సూరజ్ కుమార్ చంద్ పురుషుల సింగిల్స్ టైటిల్ కైవసం చేసుకుని స్వర్ణ పతకం సాధించాడు. ఈ టోర్నీ చరిత్రలో గోల్డ్ మెడల్ గెలిచిన తొలి భారత ప్లేయర్‌గా సూరజ్ రికార్డు నెలకొల్పాడు. ముంబైలో జరిగిన ఫైనల్లో సూరజ్ హంగేరీకి చెందిన బెనెడెక్ టకాక్స్‌తో తలపడ్డాడు. ఐదు గేములపాటు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో సూరజ్ 5-11, 11-8, 11-5, 6-11, 11-4 తేడాతో విజయం సాధించాడు. తొలి గేమ్‌ను చేజార్చుకున్న సూరజ్, ఆ తర్వాత పుంజుకుని వరుసగా రెండు గేమ్‌లు గెలిచాడు. నాలుగో గేమ్‌లో ప్రత్యర్థి ఎదురుదాడికి తలొగ్గినా, నిర్ణయాత్మక ఐదో గేమ్‌లో అద్భుతంగా ఆడి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. వరల్డ్ యూనివర్సిటీ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో సూరజ్‌కు ఇది రెండో పతకం. గత ఎడిషన్‌లో అతను మెన్స్ సింగిల్స్‌లో కాంస్య పతకం సాధించాడు. కాంస్యం నుంచి నేరుగా స్వర్ణానికి ఎదిగి భారత్‌కు గర్వకారణంగా నిలిచాడు. ఈ ఏడాది చివర్లో జరగనున్న ఆసియా గేమ్స్‌లో పాల్గొనే భారత స్క్వాష్ జట్టులో సూరజ్ కూడా చోటు దక్కించుకున్నాడు.