RJNEWS TELUGU
Date of Publish : 12 November 2026, 8:59 am Posted by : RJ NEWS TELUGU

అనుమానంతో భార్యను చంపి ఆత్మహత్యగా నమ్మించే యత్నం

🔸నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన ఉప్పల్‌ పోలీసులు

ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : భార్య ప్రవర్తనపై అనుమానం.. తరచూ దంపతుల మధ్య గొడవలు.. ఈ నేపథ్యంలో భార్యను భర్త హత్య చేసిన ఘటన ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని న్యూ శాంతినగర్‌లో చోటుచేసుకుంది. అనంతరం హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ప్రియాంక (22)ను ఆమె భర్త గుగులోత్‌ రాజశేఖర్‌ (26) గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఉప్పల్‌ ఇన్‌స్పెక్టర్‌ వై. రామలింగారెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం నీలికుర్తి గ్రామంలోని బజనా తండాకు చెందిన గుగులోత్‌ రాజశేఖర్‌, అతడి భార్య ప్రియాంక జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చి ఉప్పల్‌ న్యూ శాంతినగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ఒక కుమార్తె ఉంది. రాజశేఖర్‌ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తుండగా, ప్రియాంక గృహిణిగా ఉంటోంది. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న రాజశేఖర్‌ నవంబరు 11వ తేదీ తెల్లవారుజామున సుమారు 2.30 గంటలకు ప్రియాంకను గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అనంతరం ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రికి సమాచారం అందించాడు. కుమార్తె మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో రాజశేఖరే హత్యకు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు.. అదే రోజు ఉప్పల్‌ బాగాయత్‌ ప్రాంతంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. అనంతరం న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్‌ వై. రామలింగారెడ్డి తెలిపారు.