RJNEWS TELUGU
Date of Publish : 14 August 2026, 8:41 pm Posted by : RJ NEWS TELUGU

టీబీ నియంత్రణకు ఇంటింటి సర్వే

ఆర్.జె.న్యూస్, మేడ్చల్‌: జిల్లాలో క్షయ (టీబీ) వ్యాధి నియంత్రణకు చేపడుతున్న చర్యల్లో భాగంగా ‘స్వాస్థ్య నగరం స్టీరింగ్‌ కమిటీ రౌండ్‌టేబుల్‌ సమావేశం’ నిర్వహించారు. సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి (డీఎంహెచ్‌వో) డా. కె. ఆనంద్‌ పాల్గొని జిల్లాలో చేపడుతున్న ఇంటింటి క్రియాశీల టీబీ కేసుల గుర్తింపు, పరిశోధన పురోగతిపై సమీక్షించారు.పీర్జాదిగూడ, బోడుప్పల్‌, పోచారం మున్సిపాలిటీల పరిధిలోని 72 వార్డుల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. టీబీ లక్షణాలు ఉన్న వారిని ముందుగానే గుర్తించి అవసరమైన పరీక్షలు నిర్వహించడం ద్వారా వ్యాధిని నిర్ధారించడమే సర్వే లక్ష్యమని పేర్కొన్నారు. ఇందులో భాగంగా పోర్టబుల్‌ ఎక్స్‌రే పరికరాలతో ఛాతీ పరీక్షలు, క్వాంటిఫెరాన్‌-ప్లస్‌ పరీక్షల ద్వారా స్క్రీనింగ్‌ చేస్తున్నారు. అనుమానితులకు తదుపరి నిర్ధారణ కోసం ఎన్‌ఏఏటీ పరీక్షలు నిర్వహించనున్నారు.
🔸ప్రజలు సహకరించాలి
ఇంటింటి సర్వేలో ప్రతి కుటుంబం తప్పనిసరిగా పాల్గొని ఆరోగ్య వివరాలను అందించాలని డా. ఆనంద్‌ కోరారు. ఆరోగ్య సిబ్బంది సూచించిన పరీక్షలకు సహకరించాలని తెలిపారు. దీర్ఘకాలిక దగ్గు, జ్వరం, రాత్రిపూట చెమటలు, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా ఆరోగ్య సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. టీబీని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందించడం ద్వారా వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు.
సమావేశంలో పరిశోధన మధ్యంతర విశ్లేషణ, అధ్యయన ప్రక్రియ, చికిత్సా దశలు, గుణాత్మక సమాచారంతో వెల్లడైన అంశాలపై చర్చించారు. సిబ్బందికి శిక్షణ, అవగాహన, కమ్యూనికేషన్‌ కార్యక్రమాలు (ఏసీఎస్‌ఎం), సమాచార నిర్వహణ వ్యవస్థ (ఎంఐఎస్‌) తదితర అంశాలపై సమీక్షించారు. ఎంపిక చేసిన మున్సిపల్‌ ప్రాంతాల్లో రెండు రకాల స్క్రీనింగ్‌ విధానాల ప్రభావాన్ని అంచనా వేసి టీబీ ప్రాబల్యాన్ని తగ్గించడమే పరిశోధన ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్‌ వర్చువల్‌గా పాల్గొన్నారు. ఎస్‌టీవో, ఎస్‌టీడీసీ డైరెక్టర్‌ డా. రాజేశం, పీవో–ఎన్‌టీఈపీ డా. శ్రీదేవి, ది యూనియన్‌ సంస్థ హెడ్‌ ఆఫ్‌ ప్రోగ్రామ్స్‌ డా. ఆర్చనా బెరి తదితరులు పాల్గొన్నారు.