RJNEWS TELUGU
Date of Publish : 07 October 2026, 10:32 pm Posted by : RJ NEWS TELUGU

నకిలీ GPAతో రూ.కోట్ల భూముల అక్రమ లావాదేవీలు

🔸18 ఎకరాలకుపైగా భూమికి తప్పుడు పత్రాలు
ఐదుగురు నిందితుల అరెస్టు.. మధ్యవర్తుల పాత్రపై దర్యాప్తు

ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్: నకిలీ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (GPA), తప్పుడు స్థిరాస్తి పత్రాలతో రూ.కోట్ల విలువైన భూములను అక్రమంగా విక్రయించిన కేసులో ఐదుగురు నిందితులను కీసర పోలీసులు అరెస్టు చేశారు. కీసర మండలం చెరియాల గ్రామంలోని సర్వే నంబరు 94లో ఉన్న 18 ఎకరాల 19 గుంటల భూమికి సంబంధించి అక్రమ లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తులో తేలింది.అసలు భూ యజమానుల పేర్లతో నకిలీ GPA పత్రాలు సృష్టించి.. వాటి ఆధారంగా పలు ప్లాట్లకు సేల్‌ డీడ్‌లు రిజిస్ట్రేషన్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్లాట్‌ నంబర్లు 21, 28, 38, 59, 129, 145లకు సంబంధించి సేల్‌ డీడ్‌లు రిజిస్ట్రేషన్‌ చేసినట్లు తెలిపారు. అనంతరం కొన్ని ఆస్తులకు సేల్‌ డీడ్‌లు, అగ్రిమెంట్‌ ఆఫ్‌ సేల్‌ కమ్‌ GPA లావాదేవీలు నిర్వహించినట్లు వెల్లడించారు.

ఐదుగురి అరెస్టు

ఈ కేసులో బసరికారి శ్రీనివాస్‌రావు, బార్లపాటి ఆనంద్, బొర్రా వెంకటేష్, మిర్‌ సాదిక్‌ అలీ, రామిడి సత్తిరెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ పత్రాల ఆధారంగా భూములు, ప్లాట్ల లావాదేవీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. కొందరు నిందితులు సాక్షులుగా సంతకాలు చేసి నగదు తీసుకున్నట్లు గుర్తించారు.

మధ్యవర్తులపై ఆరా

ఈ వ్యవహారంలో తటాకం నారాయణ శర్మ, జూపల్లి రవీందర్‌ మధ్యవర్తులుగా వ్యవహరించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దీంతో వారి పాత్రపైనా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. నకిలీ పత్రాల తయారీ, రిజిస్ట్రేషన్‌కు సహకరించిన వ్యక్తులు, ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహారంలో మరికొందరి ప్రమేయం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

కొనుగోలుదారుల వివరాల సేకరణ

కేసు దర్యాప్తులో భాగంగా నకిలీ పత్రాలతో జరిగిన ఇతర లావాదేవీలు, సంబంధిత కొనుగోలుదారుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. అరెస్టు చేసిన నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. ఈ కేసును జవహర్‌నగర్‌ ఏసీపీ ఎస్‌.చక్రపాణి పర్యవేక్షణలో కీసర ఇన్‌స్పెక్టర్‌ బిక్కి రమేశ్, ఎస్‌ఐ ఎస్‌.అనిల్‌కుమార్, కానిస్టేబుల్‌ శ్రీధర్‌ దర్యాప్తు చేస్తున్నారు.

ఆస్తి కొనుగోలు ముందు అప్రమత్తత

స్థిరాస్తులు కొనుగోలు చేసే ముందు రెవెన్యూ రికార్డులు, సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలోని పత్రాలను పూర్తిగా పరిశీలించి, యాజమాన్య హక్కులను నిర్ధారించుకోవాలని పోలీసులు సూచించారు. నకిలీ పత్రాలు లేదా అనుమానాస్పద భూ లావాదేవీలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.