RJNEWS TELUGU
Date of Publish : 06 October 2026, 9:42 pm Posted by : RJ NEWS TELUGU

మంచినీరు, డ్రైనేజీ సమస్యలపై తక్షణమే స్పందించాలి

🔸అధికారులను కోరిన మేడ్చల్‌ బీజేపీ ఇన్‌ఛార్జి ఏనుగు సుదర్శన్‌రెడ్డి

ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : నియోజకవర్గంలోని పలు డివిజన్లు, కాలనీల్లో మంచినీటి సరఫరా, డ్రైనేజీ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మేడ్చల్‌ నియోజకవర్గ బీజేపీ ఇన్‌ఛార్జి ఏనుగు సుదర్శన్‌రెడ్డి అన్నారు. సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా శాశ్వత పరిష్కారం లభించకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ఈ మేరకు హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ ఎండీ అశోక్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నెలకొన్న మంచినీటి సరఫరా, డ్రైనేజీ సమస్యలను ఆయన వివరించారు. ప్రజలకు సురక్షితమైన మంచినీరు అందించడం, పారిశుద్ధ్యంతో కూడిన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడం అధికారుల బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజలు పదేపదే ఫిర్యాదులు చేస్తున్నా సమస్యలు పరిష్కారం కాకపోవడం సరికాదన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను గుర్తించి, శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరారు. మంచినీరు, డ్రైనేజీ వంటి ప్రాథమిక సమస్యలను అత్యవసర ప్రజా సమస్యలుగా పరిగణించాలని, వాటి పరిష్కారానికి కాలపరిమితితో కూడిన కార్యాచరణ రూపొందించి పనులు ప్రారంభించాలని ఏనుగు సుదర్శన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం అవసరమైనంత వరకు అధికారుల దృష్టికి తీసుకెళ్లి, ప్రజల తరఫున నిరంతరం పోరాడుతామని స్పష్టం చేశారు.