RJNEWS TELUGU
Date of Publish : 06 October 2026, 10:23 pm Posted by : RJ NEWS TELUGU

ఏడాదిలోగా ఇందిరమ్మ టవర్స్‌ పూర్తి

🔸లబ్ధిదారుల చేతికి ఇళ్ల తాళాలు: మంత్రి పొంగులేటి

ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు చేపట్టిన ఇందిరమ్మ టవర్స్‌ నిర్మాణాలను ఏడాదిలోగా పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగిస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నిర్మాణాలను నిర్ణీత గడువు కంటే ముందే పూర్తి చేసే కాంట్రాక్టర్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు. నెల రోజుల ముందుగా నిర్మాణం పూర్తి చేస్తే రూ.45 లక్షలు, రెండు నెలల ముందుగా పూర్తిచేస్తే రూ.90 లక్షల ప్రోత్సాహక బహుమతి ఇస్తామని వెల్లడించారు.
కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం గాజులరామారంలో మంగళవారం ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌ నిర్మాణానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సహచర మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద తదితరులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలోని 23 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్‌ను నిరంతర ప్రక్రియగా నిర్మిస్తామని తెలిపారు.

5,218 మంది అర్హులు.. 480 మందికి ఇళ్లు

కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో ఇళ్ల కోసం 7 వేల మందికిపైగా దరఖాస్తులు రాగా, పరిశీలన అనంతరం 5,218 మందిని అర్హులుగా గుర్తించినట్లు మంత్రి తెలిపారు. అర్హులైన వారిలో లబ్ధిదారుల ఎంపికను బహిరంగ లక్కీ డ్రా ద్వారా పారదర్శకంగా నిర్వహించి 480 మందిని తుది జాబితాకు ఎంపిక చేసినట్లు చెప్పారు. ఎంపిక ప్రక్రియను ఆన్‌లైన్‌లో నిర్వహించామని, ఎవరికి ఏ విధంగా ఇల్లు మంజూరైందో లబ్ధిదారులకు వివరించడంతో పాటు సంబంధిత ధ్రువపత్రాలను అందజేస్తామని తెలిపారు.

మరో మూడు విడతల్లో ఇళ్ల నిర్మాణం

ప్రస్తుతం కేటాయించిన ఇళ్లతో కార్యక్రమం ముగియదని మంత్రి స్పష్టం చేశారు. మరో మూడు విడతల్లోనూ ఇళ్ల నిర్మాణాన్ని చేపడతామన్నారు. ప్రస్తుతం సుమారు 7.5 ఎకరాల స్థలం అందుబాటులో ఉందని, నియోజకవర్గంలోని ఇతర ప్రభుత్వ, హౌసింగ్‌ శాఖ భూములను గుర్తించి పేదలకు ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. ఈ మేరకు హౌసింగ్‌ శాఖ ఉన్నతాధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు.

నాణ్యతకు పెద్దపీట

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని మంత్రి అన్నారు. లబ్ధిదారులు కూడా నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. తమ కళ్ల ముందే ఇల్లు నిర్మించబడాలని, నాణ్యమైన ఇంటిని సొంతం చేసుకున్నామనే తృప్తి, ఆనందం లబ్ధిదారులకు కలగాలన్నదే ఇందిరమ్మ ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. పేదల చిన్నచిన్న కోరికలను నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, పేదవాడి సొంతింటి కలను హామీగా కాకుండా కార్యరూపంలోకి తీసుకువస్తున్నామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ శ్రీనివాసరెడ్డి, హౌసింగ్‌ శాఖ కార్యదర్శి వి.పీ. గౌతమ్‌, జిల్లా కలెక్టర్‌ మను చౌదరి తదితరులు పాల్గొన్నారు.