RJNEWS TELUGU
Date of Publish : 31 October 2026, 9:05 am Posted by : RJ NEWS TELUGU

భారీ వర్షంలోనూ ఆగని జన సంకల్ప పాదయాత్ర

🔸డంపింగ్‌ యార్డ్‌ తొలగించే వరకు పోరాటం ఆగదు

🔸‘ఈ ముఖ్యమంత్రికి ఎంత చెప్పినా అర్థం కావడం లేదు.. చలనం లేదు’ – ఎంపీ ఈటల రాజేందర్‌

🔸కుర్చీలను తలపై పెట్టుకుని వర్షంలోనే ప్రసంగం విన్న ప్రజలు

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డ్‌ కాలుష్య బాధితులకు అండగా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ చేపట్టిన జన సంకల్ప పాదయాత్ర నాలుగో రోజు కూడా కొనసాగింది. భవానీనగర్‌, నాగారం ప్రాంతాల్లో నిర్వహించిన పాదయాత్రకు భారీ వర్షం అడ్డంకిగా మారినా నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు వెనక్కి తగ్గలేదు. వర్షంలో తడుస్తూనే ఈటల రాజేందర్‌ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సభా వేదికపైకి వర్షపు నీరు చేరుతున్నా మైక్‌ పట్టుకుని తన ప్రసంగాన్ని కొనసాగించారు. సభకు హాజరైన ప్రజలు కుర్చీలను తలపై పెట్టుకుని వర్షంలోనే నాయకుల ప్రసంగాలను విన్నారు. ఎంపీలు ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావు సైతం వర్షాన్ని లెక్కచేయకుండా సభలో పాల్గొన్నారు.

వంశరాజు మల్లేష్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. ప్రజలు గెలిపించి పంపించిన రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రజలను నిచ్చెన మెట్లుగా ఉపయోగించుకుని సీఎం పదవిని చేపట్టి ఇప్పుడు ముఖం చాటేస్తున్నారని ఆరోపించారు. తమ నాయకులతో మాట్లాడిస్తూ ప్రజల బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. జవహర్‌నగర్‌ పట్టణంలో పేదరికం తీవ్రంగా ఉందని, ప్రజలకు కనీసం రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు.డంపింగ్‌ యార్డ్‌ సమస్యపై ప్రభుత్వం స్పందించే వరకు తమ పోరాటం ఆగదని ఈటల స్పష్టం చేశారు. చెత్త లారీల చక్రాల కింద పడి ప్రాణాలు కోల్పోయిన యువకుల భార్యల పుస్తెల తాళ్ల సాక్షిగా ఈ సమస్యకు అంతం పలుకుతామని అన్నారు. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సమస్యపై స్పందించాలని కోరారు. ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే డంపింగ్‌ యార్డ్‌ తరలింపునకు సంబంధించిన డీపీఆర్‌ సిద్ధం చేసి ఇవ్వాలని, తమ ఎంపీలందరం కలిసి ప్రధాని నరేంద్ర మోదీని ఒప్పించి అవసరమైన నిధులు తీసుకొస్తామని తెలిపారు. రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా అభివృద్ధి కోసం నిధులు అందించే ప్రధాని మోదీ అని పేర్కొన్నారు. ‘ఈ ముఖ్యమంత్రికి ఎంత చెప్పినా అర్థం కావడం లేదు.. చలనం లేదు’ అంటూ రేవంత్‌రెడ్డిపై విమర్శలు గుప్పించారు.

బీజేపీ సీనియర్‌ నాయకుడు గరికపాటి మోహన్‌రావు మాట్లాడుతూ.. డంపింగ్‌ యార్డ్‌ బాధితుల పోరాటానికి తమ సంపూర్ణ సంఘీభావం ఉంటుందని తెలిపారు. ఈటల రాజేందర్‌ నాయకత్వంలో డంపింగ్‌ యార్డ్‌ తొలగిపోతుందనే నమ్మకం ప్రజల్లో ఏర్పడిందన్నారు.

బీజేపీ నాయకురాలు కీర్తిరెడ్డి మాట్లాడుతూ.. జవహర్‌నగర్‌కు వచ్చి చూస్తే ఇక్కడి ప్రజలు తీవ్ర దుర్వాసన మధ్య ఎలా జీవిస్తున్నారో అర్థమవుతుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెంటనే స్పందించి డంపింగ్‌ యార్డ్‌ సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమస్యపై అందరూ కలిసికట్టుగా గట్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు.నాలుగు రోజుల పాటు సాగిన జన సంకల్ప పాదయాత్రకు మద్దతుగా నిలిచిన డంపింగ్‌ యార్డ్‌ బాధితులు, స్థానిక ప్రజలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు ఈటల రాజేందర్‌ కృతజ్ఞతలు తెలిపారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజలు చూపిన మద్దతు తమ బాధ్యతను మరింత పెంచిందన్నారు. కార్యకర్తల నిబద్ధతకు సెల్యూట్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, శాసనసభ పక్ష నాయకులు మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే సూర్య నారాయణ, భైంసా ఎమ్మెల్యే రామారావు పటేల్ , ఎమ్మెల్యే డీ.సూర్యనారాయణ గుప్తా,బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్ధి డాక్టర్ సి అంజిరెడ్డి ,మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్రీనివాస్ , బీజేపీ రాష్ట్ర నాయకులు విక్రమ్ రెడ్డి,మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జి ఏనుగు సుదర్శన్ రెడ్డి,బీజేపీ సీనియర్‌ నాయకులు గరికపాటి మోహన్‌రావు, చీకోటి ప్రవీణ్‌కుమార్‌, కీర్తిరెడ్డి, వంశరాజు మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.